
D Educt: Sept 30: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) నిర్వహిస్తున్న కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2026) దరఖాస్తుల సవరణ ప్రక్రియ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, దరఖాస్తు ఫీజు చెల్లించిన అభ్యర్థులకు తమ అప్లికేషన్లో అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 5 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్ iimcat.ac.in ద్వారా దరఖాస్తులను సవరించుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో పోర్టల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
కరెక్షన్ విండో ద్వారా అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్, సంతకం, పరీక్ష రాసే రాష్ట్రం లేదా నగరం ప్రాధాన్యతలను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, రిజర్వేషన్ కేటగిరీ వంటి వివరాలను సవరించేందుకు అవకాశం ఉండదు.
అదేవిధంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించిన విద్యార్హతల వివరాల్లోనూ మార్పులు చేయడానికి వీలు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి సవరణకు అనుమతించిన వివరాల్లో తప్పులు ఉన్న అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో లాగిన్ అయి వాటిని సరిచేసుకోవాలని సూచించారు.
కాగా, CAT 2026 పరీక్ష నవంబర్ 29న దేశవ్యాప్తంగా మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నవంబర్ 4 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
