D NEWS: నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి 5వ పాలకవర్గం ఏర్పాటైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నం. 687 ద్వారా నూతన పాలకవర్గాన్ని నియమించింది.

చైర్‌పర్సన్‌గా చలసాని స్పందన రాజీవ్, వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా సూరోజు రవీంద్రచారి, పొతురాజు జ్యోతి, బుర్రి వెంకటయ్య, రామావత్ వస్యా, ధనావత్ సైదులు, ఉట్కూరి సైదులు, కర్నం రామ నర్సయ్య, పల్లె కాశయ్య, గడ్డం ప్రియాంక, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, పోల విశ్వనాథం, రెబ్బె రమేష్ నియమితులయ్యారు.

అధికారిక సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ అధికారి దామోదర్, హుజూర్‌నగర్ సహాయ వ్యవసాయ సంచాలకులు రవి, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి కొనసాగనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల తేదీ నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పాలకవర్గం కొనసాగుతుంది.

నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎంపికలో ఈసారి పదవుల సమీకరణలో మార్పు చోటుచేసుకుంది. గతంలో చైర్మన్ పదవి పాలకవీడు మండలానికి, వైస్ చైర్మన్ పదవి నేరేడుచర్ల మండలానికి దక్కగా.. ఈసారి చైర్మన్ పదవిని నేరేడుచర్ల మండలానికి, వైస్ చైర్మన్ పదవిని పాలకవీడు మండలానికి కేటాయించారు.

నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రైతులకు సంబంధించిన మార్కెట్ వ్యవహారాలు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, మార్కెట్ నిర్వహణ వంటి అంశాల్లో పాలకవర్గం కీలకంగా వ్యవహరించనుంది. రెండు మండలాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కొత్త కూర్పు ఉండటం ఈ నియామకంలో ప్రధాన అంశంగా నిలిచింది.