
D Educt: Sept 10: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. ఇక బట్టీకి చెక్!
ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో బట్టీ కొట్టే విధానానికి స్వస్తి పలికి.. వారిలో విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించేలా ప్రశ్నపత్రాల్లో మార్పులు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పరాఖ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం గుర్తుపెట్టుకోవడమే కాకుండా.. వాటిని అర్థం చేసుకుని, విశ్లేషించి సమాధానాలు ఇచ్చేలా పరీక్షల విధానాన్ని మార్చనున్నారు. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించేలా రూపొందించనున్నారు. జాతీయ విద్యా విధానం (NEP)కు అనుగుణంగా దేశవ్యాప్తంగా పరీక్షల విధానంలో ఒకే తరహా ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ప్రశ్నలు ఇస్తున్నారు. పబ్లిక్ పరీక్షల్లోనూ ప్రధానంగా వీటి నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను బట్టీ పట్టి పరీక్షల్లో రాస్తున్న పరిస్థితి ఉందని అధికారులు గుర్తించారు. ఈ విధానానికి స్వస్తి పలికి.. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నారు.
10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో..
ఈ పరిస్థితిని మార్చేందుకు 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను కొత్త తరహాలో ఇవ్వనున్నారు. విద్యార్థి ఒక అంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? దాన్ని కొత్త పరిస్థితుల్లో ఎలా అన్వయించగలడు? అనే అంశాలను పరీక్షించేలా ప్రశ్నలను రూపొందించనున్నారు. తద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందుతాయని అధికారులు భావిస్తున్నారు.
కొత్త విధానంలో భాగంగా ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంక్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియట్ విద్యా మండలి అధ్యాపకులకు కార్యశాలలు నిర్వహిస్తోంది. అధ్యాపకుల నుంచి సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనను పరీక్షించే ప్రశ్నలను స్వీకరించి.. వాటిని పరిశీలించిన అనంతరం ప్రత్యేక క్వశ్చన్ బ్యాంక్‌ను రూపొందించనున్నారు.
కొత్త పాఠ్యపుస్తకాల్లోనూ ప్రశ్నలకు చోటు
సిద్ధం చేసిన ప్రశ్నలను వచ్చే విద్యా సంవత్సరం ముద్రించే కొత్త పాఠ్యపుస్తకాల్లో పాఠం చివర ఇచ్చే ప్రశ్నల్లో చేర్చనున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలోనే కొత్త తరహా ప్రశ్నలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. పాఠ్యాంశాలను కేవలం కంఠస్థం చేయకుండా.. వాటిని అర్థం చేసుకుని సమాధానాలు రాసేలా విద్యార్థులను ప్రోత్సహించనున్నారు.
మొత్తంగా ఇంటర్మీడియట్ విద్యలో బట్టీ విధానాన్ని తగ్గించి.. అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, ఆలోచించడం, అన్వయించడం వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా పరీక్షల విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నారు.
