
D NEWS: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా సెప్టెంబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉదయం 10:30 గంటలకు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. SIR ప్రక్రియపై తలెత్తుతున్న అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన అన్నారు.
ఎన్నికల సంఘంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వడంతో పాటు SIR ప్రక్రియపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనలు, ఉద్యమాలకు ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
