
DNews: Dec 12: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సీట్లు కూడా గెలవలేకపోవడం ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సూచిక అని అన్నారు. ప్రారంభంలో పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా, ఫలితాలు మాత్రం ప్రజలు రేవంత్ పాలన వైఫల్యాలతో విసిగిపోయారని నిరూపించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అక్రమాలు, అణచివేతలు చేసినా, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పోరాడి సర్పంచ్‌లు, వార్డ్ సభ్యులుగా విజయం సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పింక్ సైనికులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా జిల్లా పర్యటనల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఫలితాలు తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చేశాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మరో మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే ఈ–20 ఓట్ల తేడాతో గెలిచిందని, గ్రామాల నుంచే కాంగ్రెస్ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అన్నారు. రెండు సంవత్సరాల తర్వాత కూడా గ్రామీణులు ఆరు హామీలు, పెన్షన్ పెంపు, మహాలక్ష్మి, తులాం బంగారు హామీ పేరుతో చేసిన మోసాలను మరచిపోలేదని, రైతులు యూరియా సంచుల కోసం చేసిన పోరాటాలు, బోనస్ పేరుతో ఇచ్చిన అబద్ధపు హామీలు, పంట అమ్మకానికి ఎదురైన ఇబ్బందులను గుర్తుంచుకున్నారని అన్నారు. గత పదేళ్లలో గ్రామాల్లో అభివృద్ధి దిశగా సాగిన పాలన, గత రెండు సంవత్సరాల్లో పూర్తిగా కూలిపోయిందని విచారం వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణలో లోపాలు, ట్రాక్టర్లకు డీజిల్ నింపలేని పరిస్థితి ప్రజలను ఆలోచింపజేసిందని అన్నారు. ఇది కేవలం ఆరంభమేనని, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం త్వరలోనే మరింత లోతుగా పడిపోతుందని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి ఎన్నికలో పింక్ జెండా ఎగరబోతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
