
DSports 8 Dec:చెన్నై: ప్రతిష్టాత్మక FIH మెన్స్ జూనియర్ హాకీ ప్రపంచకప్ 2025లో టైటిల్ గెలవాలన్న భారత జట్టు కల చెదిరింది. ఆదివారం చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ చేతిలో భారత జూనియర్ జట్టు 1-5 గోల్స్ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది
- మ్యాచ్ ఆరంభం నుంచే జర్మనీ అటాకింగ్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వారి దూకుడు, వ్యూహాత్మక ఆటతీరు ముందు భారత డిఫెన్స్ తేలిపోయింది. మొదటి అర్ధభాగం ముగిసేసరికి జర్మనీ 3-0 ఆధిక్యంలో నిలిచింది. రెండవ అర్ధభాగంలో భారత్ పుంజుకోవడానికి ప్రయత్నించినా, జర్మనీ గోల్ కీపర్ జాస్పర్ డిట్జర్ అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అవకాశం దొరకలేదు. ముఖ్యంగా, భారత్ మిడ్‌ఫీల్డ్‌లో బంతిని నిలబెట్టుకోలేకపోవడం, సిల్లీ మిస్టేక్‌లు చేయడం ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
- సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత జట్టు ఇప్పుడు కాంస్య పతకం (మూడో స్థానం) కోసం అర్జెంటీనాతో తలపడనుంది. మరో సెమీఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ 2-1తో విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ టైటిల్ కోసం ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనుంది.
ఈ ప్రపంచకప్‌లో సొంతగడ్డపై మరోసారి టైటిల్‌ను ముద్దాడాలనుకున్న భారత జట్టు ఆశలు అడియాసలయ్యాయి. అయితే కాంస్య పతకం సాధించేందుకు యువ భారత్ శక్తివంచన లేకుండా పోరాడుతుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
