ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ట్రేడింగ్ విండో నేపథ్యంలో హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ నుంచి మరో ఫ్రాంచైజీకి పంపే అవకాశాలపై ఇప్పటికే వార్తలు వస్తుండగా.. తాజాగా ఆయన మాజీ జట్టు గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

హార్దిక్ 2022లో గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు టైటిల్ అందించాడు. 2023లోనూ గుజరాత్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అనంతరం 2024 సీజన్‌కు ముందు ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి వచ్చిన హార్దిక్‌కు ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

అయితే ముంబైతో హార్దిక్ ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఐపీఎల్ 2027కు ముందు అతడిని ట్రేడ్ చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హార్దిక్ విషయంలో ముంబై ఇండియన్స్ ఇంకా తుది నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత లేదు.

గుజరాత్‌తో చర్చలు.. కానీ షరతుతో

ఈ నేపథ్యంలో హార్దిక్ తన మాజీ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించాయి. గుజరాత్ యాజమాన్యం కూడా ఆయన పునరాగమనంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తోనూ ఈ అంశంపై సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌లోకి తిరిగి రావాలంటే కెప్టెన్సీ బాధ్యతలు తనకే ఇవ్వాలని హార్దిక్ షరతు పెట్టినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్‌ను ఫ్రాంచైజీ అంగీకరించలేదని, దీంతో ప్రతిపాదిత ట్రేడ్ ముందుకు సాగలేదని సమాచారం.

హార్దిక్ మేనేజర్ ఖండన

మరోవైపు, ఈ వార్తలపై హార్దిక్ పాండ్యా మేనేజర్ స్పందిస్తూ వాటిని ఖండించారు. హార్దిక్ ఏ ఫ్రాంచైజీతోనూ స్వయంగా ట్రేడ్ లేదా ట్రాన్స్‌ఫర్‌పై చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి విషయాలపై చర్చలు జరిగితే అవి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ద్వారానే జరుగుతాయని పేర్కొన్నారు.

దీంతో హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2027లో ఏ జట్టు తరఫున ఆడతాడనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో ప్రతిపాదిత రిటర్న్ విఫలమైన నేపథ్యంలో.. ముంబై అతడిని కొనసాగిస్తుందా? లేక మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేస్తుందా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.