
D Spiritual: Oct 11: మంత్రాలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
మంత్రాలయం: దేవీ నవరాత్రులలో భాగంగా మొదటి రోజు దుర్గాదేవి బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటేష్ శెట్టి ఆధ్వర్యంలో సంఘం ముఖ్య సభ్యులు స్థానిక వాసవీ సత్రంలో జెండా ఆవిష్కరించి దేవీ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు.
అనంతరం గౌతమ్ ఆచార్ ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రి పూజలు నిర్వహించారు. గణపతి పూజ, లక్ష్మీ పూజల అనంతరం దుర్గాదేవిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి విశేష పూజలు చేశారు. అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఆర్యవైశ్య సంఘం పెద్దలు, సంఘ సభ్యులు, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
