D Spiritual: Oct 8: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కొత్త డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకురానుంది. ‘గరుడ’ (Garuda) పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌ను త్వరలో భక్తుల వినియోగానికి తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండు ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలోనూ ఈ యాప్‌ అందుబాటులో ఉంటుంది.

తిరుమలలో భక్తులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని ‘గరుడ’ యాప్‌లో పొందుపరిచారు. తిరుమలలో అందుబాటులో ఉన్న వివిధ సేవలు, శ్రీవారి సేవా కేంద్రాల వివరాలు, వాటి మధ్య ఉన్న దూరం వంటి సమాచారాన్ని యాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే తిరుమలలోని వివిధ మార్గాలు, దారులకు సంబంధించిన మార్గదర్శక సమాచారాన్ని కూడా ఇందులో అందించనున్నారు.

భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు వారికి అవసరమైన వసతులు, సేవలు, మార్గాలపై మెరుగైన అవగాహన కల్పించేందుకు ‘గరుడ’ యాప్‌ ఉపయోగపడుతుందని టీటీడీ భావిస్తోంది. భక్తులు తిరుమలలో తమకు అవసరమైన సేవలను సులభంగా గుర్తించుకునేలా యాప్‌ను రూపొందించారు.

ఇప్పటికే యాప్‌కు సంబంధించిన అన్ని రకాల ట్రయల్స్‌ పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో ‘గరుడ’ యాప్‌ను అధికారికంగా భక్తుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.