
D News: Sept 24: ఉద్యోగులకు రెండు డీఏలు.. త్వరలో కేబినెట్ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను (కరువు భత్యం) కలిపి మొత్తం 6.4 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దసరా పండుగ సందర్భంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అక్టోబర్ 1న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనికి అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా కొత్త పీఆర్సీ (PRC) నివేదికను తెప్పించుకునే ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. బకాయి బిల్లుల చెల్లింపుతో ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన సీపీఎస్ (CPS) రద్దు అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలల కాలపరిమితితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో హైదరాబాద్‌లో జరగాల్సిన జేఏసీ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఉద్యోగులకు సంబంధించిన మొత్తం 69 సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
