
D News : నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ‘అఖండ-3’పై అభిమానుల్లో ఎప్పటి నుంచో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాపై కీలక క్లారిటీ ఇచ్చారు.
‘అఖండ-3’ తప్పకుండా ఉంటుంది
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన బోయపాటి శ్రీను.. బాలకృష్ణతో సినిమా తప్పకుండా ఉంటుందని తెలిపారు. ‘అఖండ-3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే సినిమాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కాకుండా సరైన సమయంలో ప్రకటిస్తేనే ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతుందని చెప్పారు.
ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్‌ను ఈ నెలాఖరులోపు ప్రకటించనున్నట్లు బోయపాటి వెల్లడించారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సమాచారం. ‘అఖండ-3’కు సంబంధించిన కీలక విషయాలను కూడా సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.
బాలయ్యతో సినిమా అంటే మరో లెవెల్
బాలకృష్ణతో కలిసి పనిచేయడం తనకు అదృష్టంగా భావిస్తానని బోయపాటి శ్రీను అన్నారు. ఆయన ఒక లెజెండ్ అని, అలాంటి హీరోతో సినిమా చేయడం ఎప్పుడూ ప్రత్యేకమేనని పేర్కొన్నారు. దీంతో మరోసారి బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతుందనే విషయం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
చిరంజీవి–బాలకృష్ణ కాంబోపై కూడా..
ఇదే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే తప్పకుండా సినిమా చేస్తానని బోయపాటి తెలిపారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలను ఒకే సినిమాలో చూపించే అవకాశం వస్తే భారీ స్థాయిలో ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ-3’ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ సినిమాలో కథ ఎలా ఉండబోతుంది? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. బోయపాటి తాజా వ్యాఖ్యలతో ‘అఖండ-3’పై మరింత హైప్ ఏర్పడింది.
