
భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రహానే.. కోచ్‌గా, మెంటార్‌గా లేదా కామెంటేటర్‌గా కొనసాగుతాడని భావించిన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్-2026లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోని అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టుతో రహానే ఒప్పందం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. రహానేను తమ జట్టులో కీలక ఆటగాడిగా పేర్కొన్న ఫ్లేమ్స్ యాజమాన్యం.. అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్లో అతడికి ఉన్న అపారమైన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. రహానే చేరికతో జట్టుకు అనుభవంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా బలపడతాయని మేనేజ్మెంట్ భావిస్తోంది.
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. గ్లాస్గో, అమ్‌స్టర్‌డామ్, ఎడిన్బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రోటర్‌డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నాయి. అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టుకు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
2011లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రహానే.. భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 195 మ్యాచ్‌లు ఆడిన రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.
టెస్టుల్లో 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించిన రహానే.. 12 సెంచరీలు నమోదు చేశాడు. వన్డేల్లోనూ మూడు శతకాలు బాదాడు. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులో నిలిచి జట్టును ఆదుకోవడంలో రహానేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2023లో భారత్ తరఫున చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన ఆయన.. ఆ తర్వాత దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పుడు అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్తో కలిసి మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు.
