దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs)లో సరికొత్త సాంకేతిక కోర్సులకు పెద్దపీట వేయనున్నారు. రోబోటిక్స్, ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Physical AI), అంతరిక్ష ఇంజినీరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో భాగంగా వివిధ ఐఐటీలలో సుమారు 6,000 మంది విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. 2027 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమాన్ని భూపత్ అండ్ జ్యోతి మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ (Bhupat and Jyoti Mehta Family Foundation) పలు ఐఐటీల భాగస్వామ్యంతో చేపట్టనుంది. రాబోయే ఎనిమిది నుంచి పదేళ్ల వ్యవధిలో దశలవారీగా ఈ కోర్సులను అభివృద్ధి చేయనున్నారు. బీటెక్, మాస్టర్స్, పీహెచ్డీ స్థాయిల్లో విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా 120 మందికి పైగా ప్రత్యేక అధ్యాపకులను కూడా నియమించే ప్రణాళిక ఉంది.

ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లు?
ఈ ప్రతిపాదనలో ప్రధానంగా రెండు సాంకేతిక విభాగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ విభాగంలో 5,000 సీట్లు, స్పేస్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో మరో 1,000 సీట్లు కల్పించనున్నారు.
రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ విభాగంలో 2,500 బీటెక్ సీట్లు, 1,200 మాస్టర్స్ సీట్లు, 1,300 పీహెచ్డీ అవకాశాలు ఉండనున్నాయి. ఇక అంతరిక్ష ఇంజినీరింగ్ విభాగంలో 500 బీటెక్ సీట్లు, 300 మాస్టర్స్ సీట్లు, 200 పీహెచ్డీ అవకాశాలు కల్పించనున్నారు.
మొత్తంగా ఈ రెండు విభాగాల్లో కలిపి 6,000 మంది విద్యార్థులకు విద్యా, పరిశోధన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సీట్లు ఒకేసారి 2027లో అందుబాటులోకి రావు. ఎనిమిది నుంచి పదేళ్ల కాలంలో దశలవారీగా విస్తరించనున్నారు.
రోబోటిక్స్, ఫిజికల్ ఏఐలో ప్రత్యేక శిక్షణ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు డిమాండ్ పెరుగుతోంది. కేవలం కంప్యూటర్లలో పనిచేసే ఏఐ మాత్రమే కాకుండా, వాస్తవ ప్రపంచంలో వస్తువులను గుర్తించి, వాటితో పనిచేసి, పరిసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే తెలివైన యంత్రాల అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాంకేతికతనే ఫిజికల్ ఏఐగా పిలుస్తున్నారు.
ఈ కోర్సుల్లో మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, సెన్సార్లు, కంట్రోల్ సిస్టమ్స్ వంటి అంశాలను కలిపి బోధించనున్నారు.
హ్యూమనాయిడ్ రోబోలు, మనుషుల మాదిరిగా నడిచే రోబోలు, స్వార్మ్ రోబోటిక్స్, సాఫ్ట్ రోబోటిక్స్, డిజిటల్ ట్విన్స్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. దీనివల్ల విద్యార్థులు కేవలం సిద్ధాంతపరమైన పరిజ్ఞానానికే పరిమితం కాకుండా కొత్త యంత్రాలు, సాంకేతిక పరిష్కారాలను రూపొందించే నైపుణ్యాలను పొందే అవకాశం ఉంటుంది.
వ్యవసాయం నుంచి వైద్య రంగం వరకు ఉపయోగాలు
ఈ కోర్సుల ద్వారా అభివృద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనేక రంగాల్లో ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వ్యవసాయంలో పంటల పర్యవేక్షణ, ఆటోమేషన్, పరిశ్రమల్లో యంత్రాల నిర్వహణ, వైద్య రంగంలో రోబోటిక్ సహాయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు ఉపయోగపడే రోబోటిక్ పరిష్కారాలు, చిన్న పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఆటోమేషన్ వ్యవస్థలు, వ్యవసాయ పనులను సులభతరం చేసే సాంకేతిక పరికరాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము, విద్యుత్ సరఫరా పరిమితులు, పరికరాల ఖర్చు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిష్కారాలను రూపొందించడంపైనా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
స్పేస్ టెక్నాలజీలోనూ కొత్త అవకాశాలు
అంతరిక్ష రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. స్పేస్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో 1,000 సీట్లు కేటాయించనున్నారు.
ఇందులో ఉపగ్రహాల నావిగేషన్ వ్యవస్థలు, అంతరిక్ష రోబోటిక్స్, మానవ అంతరిక్ష ప్రయాణాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఒక ఐఐటీలో ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.
దీంతో భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ సాంకేతికత, స్పేస్ మిషన్ల అభివృద్ధి వంటి రంగాల్లో పనిచేయాలనుకునే విద్యార్థులకు ప్రత్యేక విద్యా అవకాశాలు ఏర్పడనున్నాయి.
పరిశ్రమల్లో పనిచేసే అవకాశం కల్పించేలా శిక్షణ
విద్యార్థులకు పుస్తకాల పరిజ్ఞానంతో పాటు పరిశ్రమల్లో అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పరిశ్రమలతో కలిసి ప్రత్యేక ప్రాజెక్టులు నిర్వహించనున్నారు.
అలాగే పాల్గొనే ఐఐటీల్లో ఒకదానిలో విద్యార్థులకు చెల్లింపులతో కూడిన ఒక సెమిస్టర్ పరిశ్రమ శిక్షణ (Paid Industry Residency) అవకాశం కల్పించే అంశాన్ని కూడా ఈ కార్యక్రమంలో చేర్చారు. దీనివల్ల విద్యార్థులు చదువుతో పాటు వాస్తవ పరిశ్రమల అవసరాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
జేఈఈ అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనం?
2027 నుంచి ఈ కోర్సుల మొదటి బ్యాచ్ ప్రారంభం కావచ్చని ప్రకటించడంతో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రోబోటిక్స్, ఏఐ, అంతరిక్ష సాంకేతిక రంగాలపై ఆసక్తి ఉన్నవారికి భవిష్యత్తులో ప్రత్యేక కోర్సులను ఎంచుకునే అవకాశం ఏర్పడనుంది.
అయితే కొత్త కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఏయే ఐఐటీల్లో ఈ కోర్సులు ప్రారంభమవుతాయి? బీటెక్ ప్రవేశాలకు ఏ విధమైన అర్హతలు ఉంటాయి? జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారా? కోర్సుల ఫీజులు ఎంత? అనే అంశాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
అందువల్ల విద్యార్థులు సంబంధిత ఐఐటీల అధికారిక వెబ్సైట్లలో వెలువడే ప్రవేశ ప్రకటనలను గమనించాలి.
భారత సాంకేతిక విద్యకు కొత్త దిశ
భూపత్ అండ్ జ్యోతి మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ 2019 నుంచి ఆరు ఐఐటీలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటికే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్‌కేర్, బయోమెడికల్ ఇంజినీరింగ్, సస్టైనబిలిటీ వంటి రంగాల్లో ఎనిమిది ప్రత్యేక పాఠశాలలు, కేంద్రాల ఏర్పాటుకు సహకరించింది. ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు 4,000 మందికి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
ఇప్పుడు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో కొత్త అవకాశాలను విస్తరించడం ద్వారా దేశంలో అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఈ రంగాల్లో పరిశోధనలు చేయాలనుకునే విద్యార్థులకు ఈ కార్యక్రమం మంచి అవకాశాలను అందించనుంది.
