ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించే పరికరం కాదు. మన బ్యాంక్ ఖాతాలు, యూపీఐ లావాదేవీలు, సోషల్ మీడియా అకౌంట్లు, ఈమెయిల్ వంటి ఎన్నో సేవలు మొబైల్ నంబర్‌తో అనుసంధానమై ఉంటాయి. అలాంటి ఫోన్ ఎప్పుడైనా పోతే చాలామంది ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా అందులో ఉన్న సిమ్ కార్డ్ ఇతరుల చేతికి వెళ్తే వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్త నంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పాత మొబైల్ నంబర్‌తోనే మరో సిమ్ కార్డ్ పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం

ముందుగా పాత సిమ్‌ను బ్లాక్ చేయించాలి
మీ మొబైల్ ఫోన్ లేదా సిమ్ కార్డ్ పోయిన వెంటనే చేయాల్సిన మొదటి పని పాత సిమ్‌ను బ్లాక్ చేయించడం. ఇందుకోసం మీ టెలికాం నెట్వర్క్ కస్టమర్ కేర్‌ను మరో ఫోన్ నుంచి సంప్రదించాలి. మీ ఫోన్ పోయిందని తెలియజేసి, పాత సిమ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరాలి.
దీంతో మీ సిమ్‌ను మరొకరు ఉపయోగించి కాల్స్ చేయడం, సందేశాలు పంపడం వంటి చర్యలను అడ్డుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు తమ వినియోగదారులకు సిమ్ బ్లాకింగ్, రీప్లేస్మెంట్ సేవలను అందిస్తున్నాయి.
పాత నంబర్‌తో కొత్త సిమ్ ఎలా పొందాలి?
పాత సిమ్ బ్లాక్ అయిన తర్వాత మీ టెలికాం సంస్థకు చెందిన అధీకృత స్టోర్‌ను సందర్శించాలి. అక్కడ మీ పాత మొబైల్ నంబర్‌తో డూప్లికేట్ లేదా రీప్లేస్మెంట్ సిమ్ కావాలని అడగాలి.
మీ గుర్తింపు వివరాలను పరిశీలించిన తర్వాత అవసరమైన ఈ-కేవైసీ లేదా డిజిటల్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అదే మొబైల్ నంబర్‌తో కొత్త సిమ్‌ను జారీ చేస్తారు.
ఏ డాక్యుమెంట్లు అవసరం?
కొత్త సిమ్ పొందడానికి సాధారణంగా గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ఇందుకోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లడం మంచిది.
ఫోన్ దొంగిలించబడినట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఫిర్యాదు కాపీని కూడా భద్రపరచుకోవాలి. టెలికాం సంస్థను బట్టి అవసరమైన పత్రాలు మారవచ్చు. కాబట్టి స్టోర్‌కు వెళ్లే ముందు కస్టమర్ కేర్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి.
జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఏం చేయాలి?
జియో వినియోగదారులు పాత సిమ్‌ను నిలిపివేయడానికి 1800-889-9999 నంబర్‌ను సంప్రదించవచ్చు. అనంతరం సమీప జియో స్టోర్‌కు వెళ్లి అదే నంబర్‌తో కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎయిర్టెల్ వినియోగదారులు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి పాత సిమ్‌ను బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత ఎయిర్టెల్ స్టోర్‌ను సందర్శించి రీప్లేస్మెంట్ సిమ్ పొందవచ్చు.
వీఐ వినియోగదారులు కంపెనీ అందించే ఆన్లైన్ సిమ్ బ్లాకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అనంతరం సమీప వీఐ స్టోర్‌లో వెరిఫికేషన్ పూర్తి చేసి కొత్త సిమ్ తీసుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 1503 నంబర్‌కు (బీఎస్ఎన్ఎల్ నంబర్ నుంచి) లేదా 1800-180-1503 నంబర్‌కు (ఇతర నెట్వర్క్ నుంచి) కాల్ చేసి సహాయం పొందవచ్చు. తర్వాత సంబంధిత కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
కొత్త సిమ్ తీసుకున్న వెంటనే ఓటీపీలు వస్తాయా?
ఇక్కడ వినియోగదారులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కొత్త రీప్లేస్మెంట్ సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే అన్ని సేవలు అందుబాటులోకి రావు.
టెలికాం నిబంధనల ప్రకారం కొత్తగా జారీ చేసిన సిమ్‌లో యాక్టివేషన్ తర్వాత మొదటి 24 గంటల పాటు ఇన్కమింగ్, అవుట్గోయింగ్ ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేస్తారు. అందువల్ల బ్యాంక్ ఓటీపీలు, ఇతర ఎస్ఎంఎస్ సందేశాలు వెంటనే అందకపోవచ్చు. 24 గంటల తర్వాత ఎస్ఎంఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఫోన్ పోయినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేయించడంతో పాటు బ్యాంక్ ఖాతాలు, యూపీఐ యాప్‌లపై కూడా దృష్టి పెట్టాలి. అవసరమైతే బ్యాంకును సంప్రదించి మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయించాలి.
అలాగే ఫోన్ దొంగిలించబడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అనంతరం కేంద్ర ప్రభుత్వ సంచార్ సాథీ పోర్టల్‌లోని CEIR సేవ ద్వారా ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయించవచ్చు. దీనివల్ల ఆ ఫోన్‌ను భారతదేశంలోని మొబైల్ నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చు.
చివరిగా..
స్మార్ట్‌ఫోన్ పోయినంత మాత్రాన మీ పాత మొబైల్ నంబర్‌ను కోల్పోవాల్సిన అవసరం లేదు. వెంటనే పాత సిమ్‌ను బ్లాక్ చేయించి, టెలికాం సంస్థలో గుర్తింపు వెరిఫికేషన్ పూర్తి చేస్తే అదే నంబర్‌తో కొత్త సిమ్ పొందవచ్చు. అయితే మీ బ్యాంక్ ఖాతాలు, యూపీఐ సేవలు, వ్యక్తిగత డేటా భద్రత కోసం ఆలస్యం చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
