D Spiritual: Nov 19: యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగుల అవస్థలు.. పరిపాలనా విభాగం పనితీరుపై అసంతృప్తి!

పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, సెలవుల మంజూరులో తీవ్ర జాప్యం.. పెండింగ్‌లోనే విరమణ ప్రయోజనాలు.. ఫైళ్ల కదలికపై పర్యవేక్షణ కరువు!

యాదగిరిగుట్ట, (తెలుగుప్రభ): యాదగిరిగుట్ట దేవస్థానంలోని పరిపాలనా విభాగం పనితీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు, పదోన్నతులు, వార్షిక ఇంక్రిమెంట్లు, సెలవుల మంజూరు, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన ఫైళ్ల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభాగంలో సిబ్బందిని మార్చి ప్రక్షాళన చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విరమణ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు!

దేవస్థానానికి ఎన్నో ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. అర్హత ఉన్నప్పటికీ నెలవారీ పింఛను, గ్రాట్యూటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, వినియోగించుకోని సెలవులకు సంబంధించిన నగదు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ ఫైళ్ల తయారీలో జాప్యం, వివిధ స్థాయిల్లో అధికారుల అభ్యంతరాలు, అనవసర కొర్రీల కారణంగా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇతర దేవస్థానాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని వాపోతున్నారు.

ఇంక్రిమెంట్లు, సెలవుల మంజూరులోనూ జాప్యమే!

విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులకూ పరిపాలనా విభాగం నుంచి ఇబ్బందులు తప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో మంజూరు చేయాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లను సైతం సంబంధిత నెలలో అమలు చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంపాదిత సెలవులు, వైద్య సెలవుల మంజూరుకు కూడా రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల దరఖాస్తుల పరిష్కారంలోనూ సమాన ప్రాధాన్యం కనిపించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. జాప్యంపై ప్రశ్నిస్తే ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో కొందరు ఉద్యోగులు మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

పదోన్నతుల విషయంలో వివక్ష జరుగుతోందా?

పదోన్నతుల ప్రక్రియపై కూడా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగుల పదోన్నతి ఫైళ్లు వేగంగా కదులుతుండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగుల విషయంలో మాత్రం ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్చకులు, ఇతర ఉద్యోగుల వేతన శ్రేణులు, ఉన్నతస్థాయి పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లు త్వరగా పరిష్కారమవుతున్నాయని, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇతర ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియలో సీనియారిటీ, అర్హతలు, రిజర్వేషన్ నిబంధనలు పారదర్శకంగా అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.

గుమాస్తాల పనితీరుపై పర్యవేక్షణ ఏదీ?

పరిపాలనా విభాగంలోని గుమాస్తాలు రోజువారీగా ఎన్ని దరఖాస్తులు, ఎన్ని ఫైళ్లను పరిష్కరిస్తున్నారు? పెండింగ్‌లో ఉన్న దస్త్రాలెన్ని? వాటి పురోగతి ఎంత? అనే అంశాలపై సమీక్షించే పర్యవేక్షణ వ్యవస్థ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది విధులకు హాజరు, సమయపాలన, దస్త్రాల పరిష్కారంలో బాధ్యతలను నిర్ధారించే అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఉద్యోగులు అంటున్నారు. ఇతర విభాగాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగానే పరిపాలనా విభాగంలోని సిబ్బంది పనితీరు, ఫైళ్ల నిర్వహణపై కూడా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. కార్యాలయ పనుల నిర్వహణకు బయటి సేవల సిబ్బందిని సహాయకులుగా నియమించినప్పటికీ జాప్యం కొనసాగుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

పనిభారం పెరిగిన విభాగాలకు బదిలీ చేస్తే సెలవుల బాట!

కార్యాలయ సిబ్బంది బదిలీలు, విధుల కేటాయింపుల విషయంలోనూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పనిభారం ఎక్కువగా ఉన్న విభాగాలకు బదిలీ చేసినప్పుడు కొందరు ఉద్యోగులు ఆరోగ్య సమస్యలను కారణంగా చూపుతూ సెలవులపై వెళ్తున్నారని, దీంతో బదిలీ నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో కార్యాలయ నిర్వహణ మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కార్యాలయ విధులను ఎప్పుడూ కొందరు సిబ్బందికే పరిమితం చేయకుండా ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బందికి కూడా బాధ్యతలు అప్పగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి.. పరిపాలనా విభాగాన్ని ప్రక్షాళన చేయాలి!

దేవస్థానంలో అత్యంత కీలకమైన పరిపాలనా విభాగంలో ఇన్ని సమస్యలు పేరుకుపోతున్నా ఉన్నతాధికారులు, ఈవో ఎందుకు ప్రత్యేక దృష్టి సారించడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి విధించడం, వాటి పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహించడం, పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో అందించడం, పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకత పాటించడం అత్యవసరమని సూచిస్తున్నారు. సిబ్బంది విధుల నిర్వహణలో జవాబుదారీతనం పెంచి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కొసమెరుపు:

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో.. ఆ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ఉద్యోగుల సంక్షేమం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన ఫైళ్లే కదలకపోతే దేవస్థాన పరిపాలనలో వేగం ఎలా సాధ్యమవుతుంది? ఉద్యోగుల అవస్థలకు ముగింపు పలికేందుకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *