WhatsApp New Feature: Read Messages Without Opening Chats; No More Blue Tick Worries!

WhatsApp New Feature: వాట్సాప్ యూజర్ల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. కొత్త చాట్ ప్రివ్యూ ఫీచర్ ద్వారా చాట్ ఓపెన్ చేయకుండానే వచ్చిన మెసేజ్‌లను చదవొచ్చు. దీంతో ఎదుటివారికి బ్లూ టిక్ కనిపించదు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • వాట్సాప్ యూజర్లకు కొత్త అప్‌డేట్
  • బ్లూ టిక్ పడకుండానే మెసేజ్‌లు చదివే అవకాశం
  • చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ప్రివ్యూ
  • ప్రస్తుతం అభివృద్ధి దశలో కొత్త ఫీచర్

WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా సేవలను మెరుగుపరుస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరి నుంచైనా మెసేజ్ వస్తే దాన్ని చదవాలంటే సంబంధిత చాట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా చాట్ ఓపెన్ చేస్తే రీడ్ రిసీట్స్ ఆన్‌లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తికి బ్లూ టిక్స్ కనిపిస్తాయి. దీంతో మెసేజ్ చదివిన వెంటనే రిప్లై ఇవ్వాల్సి వస్తుందనే ఒత్తిడి కొందరిలో ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ కొత్త చాట్ ప్రివ్యూ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త చాట్ ప్రివ్యూ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ చాట్‌పై ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే పిన్, ఆర్కైవ్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. త్వరలో రానున్న కొత్త ఫీచర్‌లో ఇదే విధానాన్ని ఉపయోగించి మెసేజ్‌లను ప్రివ్యూ చూసే అవకాశం కల్పించనున్నారు. చాట్‌పై లాంగ్ ప్రెస్ చేయగానే స్క్రీన్‌పై చిన్న ప్రివ్యూ కార్డు కనిపిస్తుంది. అందులో ఆ చాట్‌కు సంబంధించిన తాజా మెసేజ్‌లను చదవవచ్చు. ఇందుకోసం పూర్తిగా చాట్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ముఖ్యంగా ఈ ప్రివ్యూ ద్వారా మెసేజ్‌లు చదివినప్పుడు రీడ్ రిసీట్స్ అప్‌డేట్ కావని సమాచారం. అంటే అవతలి వ్యక్తికి బ్లూ టిక్స్ వెళ్లవు. సాధారణంగా చాట్‌ను ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మెసేజ్ చదివినట్లు గుర్తించే విధానానికి ఇది భిన్నంగా ఉండనుంది.

ప్రివ్యూ కార్డులో మరిన్ని ఆప్షన్లు!

కేవలం మెసేజ్‌లు చదవడమే కాకుండా ప్రివ్యూ కార్డు కింద కనిపించే మెనూలో మరికొన్ని ఉపయోగకరమైన ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది. చాట్‌ను పిన్ చేయడం, ఆర్కైవ్ చేయడం, మ్యూట్ చేయడం, డిలీట్ చేయడం వంటి సదుపాయాలు ఇందులో ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే మెసేజ్‌లను రీడ్ లేదా అన్‌రీడ్‌గా మార్క్ చేయడం, చాట్‌ను లాక్ చేయడం, హోమ్ స్క్రీన్‌పై చాట్ షార్ట్‌కట్ క్రియేట్ చేయడం వంటి ఆప్షన్లు కూడా రావచ్చని సమాచారం.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

వాట్సాప్ కొత్త చాట్ ప్రివ్యూ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. WABetaInfo నివేదిక ప్రకారం, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.44.11లో ఈ ఫీచర్‌ను గుర్తించారు. అయితే ఇప్పటివరకు బీటా యూజర్లకు కూడా అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఈ ఫీచర్ ఎప్పుడు అధికారికంగా విడుదలవుతుందనే దానిపై స్పష్టత లేదు. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *