: Bigg Boss Telugu: Vamsi Becomes New House Captain, Trigun Lifts Him on His Shoulders; Varshini Breaks Down After Sacrifice

Bigg Boss Captain: బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ, రివార్డ్, రివెంజ్ టాస్కులు ఉత్కంఠగా కొనసాగాయి. ఈ టాస్కుల్లో వంశీ, శ్వేతా, త్రిగున్, దేబ్జానీ నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యారు. మరోవైపు కెప్టెన్సీ పోటీలో వంశీ విజయం సాధించి ఈ వారం కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తన స్నేహితుడు కెప్టెన్ కావడంతో త్రిగున్ ఆనందంతో వంశీని భుజాలపై ఎత్తుకుని సంబరాలు చేసుకున్నాడు.

  • బిగ్ బాస్ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా వంశీ.. త్రిగున్ గ్రాండ్ సెలబ్రేషన్స్
  • ముకేశ్ కోసం ఫ్యామిలీ మీటింగ్ అవకాశాన్ని వదులుకున్న వర్షిణి
  • రివార్డ్, రివెంజ్ టాస్కుల్లో విజేతలుగా నలుగురు కంటెస్టెంట్స్

Bigg Boss Captain: బిగ్ బాస్ హౌస్‌లో తాజాగా జరిగిన కెప్టెన్సీ, రివార్డ్, రివెంజ్ టాస్కులు ఎన్నో గొడవలు, భావోద్వేగాలకు వేదికగా నిలిచాయి. ఉదయాన్నే వర్షిణి కప్పు కడగకపోవడం, ఆహారాన్ని వృథా చేయడంపై కెప్టెన్ త్రిగున్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆమెకు ఉదయం టీ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయంపై వర్షిణి, ముకేశ్ మధ్య చర్చ జరగ్గా.. ఆ తర్వాత త్రిగున్‌తో వర్షిణి వాగ్వాదానికి దిగింది.

బాత్రూమ్ శుభ్రం చేయకపోవడంపై త్రిగున్ ప్రశ్నించడంతో మరోసారి గొడవ మొదలైంది. ఈ వివాదంలో ముకేశ్ కూడా జోక్యం చేసుకోవడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. మరోవైపు సుధీర్ తన గురించి ముకేశ్, వర్షిణి చేసిన వ్యాఖ్యలు, వారిలో వచ్చిన మార్పుల గురించి త్రిగున్, వంశీతో చర్చించాడు.

రివార్డ్, రివెంజ్ టాస్కుల్లో నలుగురు సేఫ్

రివార్డ్, రివెంజ్ టాస్కుల్లో విజయం సాధించిన వంశీ, శ్వేతా, త్రిగున్, దేబ్జానీ ఈ వారం నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యారు. అంతేకాకుండా వచ్చే వారం తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కూడా పొందారు.

అయితే రివెంజ్ టాస్కుల్లో ఓడిపోయిన రామకృష్ణ, వర్షిణి, అమన్, ముకేశ్ కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో బిగ్ బాస్ వారికి మరో అవకాశం ఇచ్చాడు. ఈ నలుగురికి ప్రత్యేక టాస్క్ నిర్వహించి, అందులో గెలిచిన వారికి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పిస్తానని ప్రకటించాడు.

ముకేశ్ కోసం ఫ్యామిలీ మీటింగ్‌ను త్యాగం చేసిన వర్షిణి

ఈ టాస్కులో వర్షిణి-ముకేశ్, అమన్-నరేష్ జంటలుగా పోటీపడ్డారు. ఇందులో వర్షిణి, ముకేశ్ విజయం సాధించారు. అయితే టాస్క్ నిర్వహణలో నరేష్ వ్యవహరించిన తీరుపై మిగతా కంటెస్టెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమన్, రామకృష్ణ కూడా నరేష్‌తో వాగ్వాదానికి దిగారు.

తన నిర్ణయంలో తప్పు ఉంటే తాను కూడా కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని వదులుకుంటానని నరేష్ చెప్పాడు. చివరకు వర్షిణి, ముకేశ్‌లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలని బిగ్ బాస్ సూచించాడు. ఈ సమయంలో ముకేశ్ తన కుటుంబాన్ని కలిసేందుకు వర్షిణి అంగీకరించింది. తనకు వచ్చిన అవకాశాన్ని స్నేహితుడి కోసం త్యాగం చేస్తూ వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటన హౌస్‌లో భావోద్వేగానికి దారితీసింది.

బిగ్ బాస్ కొత్త కెప్టెన్‌గా వంశీ.. త్రిగున్ సంబరాలు!

ఇక ఎపిసోడ్ చివర్లో కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. ఇందులో భాగంగా డీజే టాస్క్‌ను బిగ్ బాస్ ఇచ్చాడు. కెప్టెన్సీ రేసులో త్రిగున్, వంశీ, శ్వేతా, దేబ్జానీ నిలిచారు.

మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేయాలి. పాట ఆగిన వెంటనే ముందుగా గంటను అందుకున్నవారు ఒక దండ తీసుకుని తమకు నచ్చిన కెప్టెన్సీ కంటెస్టెంట్ మెడలో వేయాలి. చివరగా ఎవరికి ఎక్కువ దండలు వస్తాయో వారే కొత్త కెప్టెన్‌గా ఎంపికవుతారని బిగ్ బాస్ వెల్లడించాడు.

ఈ టాస్కులో వర్షిణి శ్వేతాకు దండ వేయగా, శివ వంశీకి మద్దతు తెలిపాడు. అలాగే నరేష్, సుధీర్, రామకృష్ణ, రామ్ ప్రసాద్, నీతూ మాస్టర్ కూడా వంశీకే దండలు వేశారు. మరోవైపు ముకేశ్, అమన్ శ్వేతాకు మద్దతు ఇచ్చారు.

చివరకు అత్యధిక దండలు అందుకున్న వంశీ ఈ వారం కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తన స్నేహితుడు కెప్టెన్ కావడంతో త్రిగున్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వంశీని భుజాలపై ఎత్తుకుని హౌస్‌లో తిప్పుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా వంశీ బాధ్యతలు చేపట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *