D News: Nov 6: గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన అక్రమాలపై ఈడీ సోదాలు

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ప్రధాన నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు

అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఆయన సన్నిహితుడైన క్యామ్‌సైన్ మీడియా ప్రతినిధి పమిడికాల్వ మధుసూదన్ తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించారు.

2020లో నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి 2020లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే జవాబుపత్రాల డిజిటల్ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2025 ఏప్రిల్ 25న విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో తొలుత కేసు నమోదైంది. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా ఎండీ పమిడికాల్వ మధుసూదన్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం హైకోర్టు ఆదేశాలతో కేసు సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ అయింది.

డిజిటల్ మూల్యాంకనం పేరుతో రూ.1.38 కోట్ల చెల్లింపు

మెయిన్స్ జవాబుపత్రాలను డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయించాలనే ప్రతిపాదనను పీఎస్సార్ ఆంజనేయులే ముందుకు తెచ్చినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఎలాంటి టెండర్లు పిలవకుండానే నామినేషన్ ప్రాతిపదికన స్టోన్ మీడియా అడ్వైజరీ సర్వీసెస్‌కు ఈ బాధ్యతలు అప్పగించి, రూ.1.38 కోట్లు చెల్లించినట్లు తేల్చింది. ఈ సంస్థ ఎండీ ఆకెళ్ల శ్రీనివాసరావు.. ఆంజనేయులుకు సన్నిహిత మిత్రుడిగా ఉన్నట్లు దర్యాప్తులో పేర్కొన్నారు.

మాన్యువల్ మూల్యాంకనం పేరుతో మరో రూ.1.14 కోట్లు

డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దుచేసి, మాన్యువల్ విధానంలో జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలన్న హైకోర్టు ఆదేశాలను కూడా పీఎస్సార్ ఆంజనేయులు పట్టించుకోలేదని పోలీసుల, సిట్ దర్యాప్తులో వెల్లడైంది. గతంలో డిజిటల్ మూల్యాంకనంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులనే మాన్యువల్ మూల్యాంకనం పేరుతో మరోసారి నమోదు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం మధుసూదన్‌కు చెందిన క్యామ్‌సైన్ మీడియా సంస్థకు రూ.1.14 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. ఈ చెల్లింపులు, నిధుల దుర్వినియోగం, ఇతర ఆర్థిక లావాదేవీలపై ప్రస్తుతం ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో సోదాలు

నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌లో సోదాలు చేపట్టి, ఆ సంస్థ ఛైర్మన్ అవ్వా శేషుకుమార్‌ను సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్‌లోని పీఎస్సార్ ఆంజనేయులు నివాసంలోనూ తనిఖీలు చేశారు.

పలు ప్రాంతాల్లో కీలక ఆధారాల సేకరణ

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పంచవటి కాలనీలో ఉన్న క్యామ్‌సైన్ మీడియా కార్యాలయం, ఎర్రమంజిల్‌లోని ఆ సంస్థ ఎండీ పి.మధుసూదన్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే సికింద్రాబాద్ డిఫెన్స్ కాలనీలోని స్టోన్ మీడియా అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగానికి చెందిన ట్రూడ్రేడర్ సర్వీసెస్ కార్యాలయంలోనూ తనిఖీలు చేపట్టారు.

వీటితో పాటు నేరేడ్‌మెట్‌లోని ఆకెళ్ల పేరి శ్రీనివాసరావు నివాసం, ఆల్వాల్ వెంకటాపురంలోని మహంకాళి రఘురామ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల సందర్భంగా పలు హార్డ్‌డిస్కులు, కీలక పత్రాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి ఆధారంగా ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు వ్యవహారంపై ఈడీ తదుపరి దర్యాప్తు కొనసాగించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *