
Summer Holidays Movie Review: వేసవి సెలవులు, అమ్మమ్మ ఊరు, స్నేహితులతో ఆటపాటలు.. ఈ జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనవి. అలాంటి మధురమైన బాల్య జ్ఞాపకాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమే ‘సమ్మర్ హాలిడేస్’. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు శ్రీకర్ నయన్ జి ఈ సినిమాను రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కథ, కథనం, నటీనటుల ప్రదర్శన ఎలా ఉన్నాయి? పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
మూవీ రివ్యూ: సమ్మర్ హాలిడేస్
- నటీనటులు: రోహన్ రాయ్ గుంటి, అరుణ్ దేవ్, ఖుషి సోని, జయసుధ, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, వాసుకి తదితరులు
- దర్శకత్వం: శ్రీకర్ నయన్ జి
- నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని
- సంగీతం: సింజిత్ యెర్రమిల్లి
- సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్
- ఎడిటింగ్: సంతోష్ నాయుడు
కథేంటంటే?
రావూరి వెంకటేష్ అలియాస్ ఆర్వీ (అరుణ్ దేవ్) చదువులో ఎప్పుడూ ముందుండాలని అతని తండ్రి (హర్షవర్ధన్) కోరుకుంటాడు. చదువు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించడు. అయితే ఆర్వీకి మాత్రం పుస్తకాల ప్రపంచం నుంచి బయటపడి, స్నేహితులతో కలిసి ఆడుకోవాలని, బయటి ప్రపంచాన్ని అన్వేషించాలని ఉంటుంది. కానీ తండ్రి కఠినమైన ఆంక్షల కారణంగా అతడికి ఆ స్వేచ్ఛ ఉండదు.
ఈ క్రమంలో 2001 వేసవి సెలవుల్లో తల్లి జానకి (వాసుకి) ఆర్వీని తోటవారిపాలెంలోని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ అతడికి కాశీ వెంకటేశ్వర్లు అలియాస్ కేవీ (రోహన్ రాయ్) పరిచయమవుతాడు. చదువుపై పెద్దగా ఆసక్తి చూపని కేవీ.. డబ్బు సంపాదిస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటాడు. పూర్తి భిన్నమైన ఆలోచనలు కలిగిన ఈ ఇద్దరు పిల్లలు ఎలా స్నేహితులయ్యారు? వారి మధ్య ఏర్పడిన అనుబంధం ఎలాంటి మలుపులు తీసుకుంది? వారి జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలే మిగతా సినిమా కథ.
కథనం ఎలా ఉందంటే?
సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకులను గతంలోకి తీసుకెళ్లే ప్రయత్నం దర్శకుడు చక్కగా చేశాడు. చదువుల ఒత్తిడి, తండ్రి క్రమశిక్షణ మధ్య పెరిగే పట్టణ పిల్లాడికి వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లడం ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో తెరపై సహజంగా చూపించారు. ముఖ్యంగా 90వ దశకం, 2000ల ప్రారంభంలో బాల్యం గడిపిన వారికి ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.
మామిడి తోటల్లో స్నేహితులతో అల్లరి చేయడం, చెరువుల్లో ఈత కొట్టడం, ఎండను సైతం లెక్కచేయకుండా వీధుల్లో క్రికెట్ ఆడటం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పల్లెటూరి వాతావరణాన్ని ఎక్కడా కృత్రిమంగా చూపించకుండా కథలో సహజంగా భాగం చేయడం దర్శకుడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఆర్వీ, కేవీల మధ్య స్నేహం ఏర్పడే విధానం బాగుంది. ఒకరు చదువుకే ప్రాధాన్యత ఇస్తే, మరొకరు జీవితాన్ని ఆనందంగా గడపడమే ముఖ్యమని భావిస్తారు. ఇలాంటి విభిన్న స్వభావాలున్న ఇద్దరి మధ్య సాగే స్నేహం, చిన్న చిన్న సంఘటనలు, భావోద్వేగాలు ఫస్టాఫ్‌ను ఆహ్లాదకరంగా నడిపిస్తాయి.
అయితే ఇంటర్వెల్ తర్వాత కథనం కొంత నెమ్మదిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు చాలావరకు ఊహించిన విధంగానే సాగుతాయి. కథలో కొత్తదనం, ఆసక్తికరమైన మలుపులు లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉంది. ప్రధాన పాత్రల మధ్య ఉన్న అనుబంధం, భావోద్వేగ సన్నివేశాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేస్తాయి.
మరోవైపు కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు తీసుకున్న సినిమాటిక్ స్వేచ్ఛలు సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మొదటి నుంచి కొడుకును చదువులో రాణింపజేయాలనే పట్టుదలతో కఠినంగా వ్యవహరించే తండ్రి.. చివర్లో కొడుకు చెప్పే ఒక్క మాటతో పూర్తిగా మారిపోవడం అంతగా నమ్మశక్యంగా అనిపించదు. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న వ్యక్తిత్వం ఒక్కసారిగా మారిపోవడానికి బలమైన కారణాన్ని చూపించాల్సి ఉంది.
ఈ కథకు క్లైమాక్స్ చాలా కీలకమైనప్పటికీ, అక్కడ ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు పండలేదు. ముగింపు సన్నివేశాలను మరింత బలంగా, హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్ది ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది. అయినప్పటికీ చిన్ననాటి స్నేహాలు, పల్లెటూరి అందాలు, వేసవి సెలవుల సందడి సినిమాను ఆసక్తిగా చూసేలా చేస్తాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్
కేవీ పాత్రలో రోహన్ రాయ్ గుంటి చక్కగా నటించాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పల్లెటూరి కుర్రాడి జీవనశైలిని, అతడి ఆలోచనలను సహజంగా తెరపై ఆవిష్కరించాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో పరిణతితో నటించడంతో పాటు, తన సహజమైన డైలాగ్ డెలివరీతో వినోదాన్ని పంచాడు.
ఆర్వీ పాత్రలో అరుణ్ దేవ్ కూడా మంచి నటన కనబరిచాడు. తండ్రికి భయపడుతూనే స్నేహితుడికి అండగా నిలవాలనుకునే పిల్లాడిగా ఆకట్టుకున్నాడు. కేవీ పాత్రలోని చలాకీతనం, ఆర్వీలోని అంతర్ముఖ స్వభావం.. ఈ రెండు భిన్నమైన లక్షణాలు వారి స్నేహానికి బలంగా నిలిచాయి.
జయసుధ తనకు లభించిన పరిమిత సమయంలోనే ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఖుషి సోని, వాసుకి పాత్రలకు కథలో మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా వాసుకి పాత్రను ఇంకాస్త భావోద్వేగభరితంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా పెద్దగా ప్రయత్నించలేదు. హర్షవర్ధన్ తన పాత్ర పరిధి మేరకు నటించాడు.
సాంకేతిక విభాగం
సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది సింజిత్ యెర్రమిల్లి అందించిన సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కథలోని భావోద్వేగాలను, పల్లెటూరి వాతావరణాన్ని మరింత అందంగా ఆవిష్కరించాయి.
సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాల అందాలను, పచ్చని ప్రకృతి దృశ్యాలను, చిన్ననాటి ఆటపాటలను తెరపై చక్కగా చూపించారు. సంతోష్ నాయుడు ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది.
దర్శకుడు శ్రీకర్ నయన్ జి పాత తరహా కథాంశాన్నే ఎంచుకున్నప్పటికీ, దాన్ని ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రంగా మలిచే ప్రయత్నం చేశాడు. బాల్యంలోని అనుభూతులు, స్నేహం, కుటుంబ బంధాలను బాగానే తెరకెక్కించాడు. అయితే సెకండాఫ్ స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- 90ల నాటి బాల్య జ్ఞాపకాలు
- పల్లెటూరి వాతావరణం
- ప్రధాన పాత్రల మధ్య స్నేహం
- రోహన్ రాయ్, అరుణ్ దేవ్ నటన
- సంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- ఊహించదగిన కథనం
- నెమ్మదిగా సాగే సెకండాఫ్
- కొన్ని లాజిక్‌కు అందని సన్నివేశాలు
- ఆశించిన స్థాయిలో లేని క్లైమాక్స్
పంచ్ లైన్
ఓవరాల్‌గా ‘సమ్మర్ హాలిడేస్’ ఒకసారి మనల్ని చిన్ననాటి రోజుల్లోకి తీసుకెళ్లే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ డ్రామా. కథలో కొత్తదనం, కథనంలో వేగం కొంత తక్కువగా ఉన్నప్పటికీ.. పల్లెటూరి అందాలు, స్వచ్ఛమైన స్నేహాలు, బాల్యపు మధుర జ్ఞాపకాల కోసం ఈ సినిమాను చూడొచ్చు.
