
Tiruvannamalai Karthigai Deepam 2026: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో కార్తీక దీపోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 24న అరుణాచల కొండపై మహా కార్తీక దీపాన్ని వెలిగించనున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు అధికారులు కీలక ఆంక్షలు విధించారు. మహా దీపం వెలిగించే రోజున కొండపైకి ఎక్కడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
Tiruvannamalai Karthigai Deepam 2026: తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం కార్తీక దీపోత్సవాలకు సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 24న అరుణాచల మహా కొండపై కార్తీక మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టాయి.
అయితే ఈసారి కార్తీక మహా దీపం రోజున కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు నిరాశ ఎదురుకానుంది. నవంబర్ 24న అరుణాచల మహా కొండపైకి భక్తులు ఎక్కడాన్ని నిషేధించినట్లు జిల్లా కలెక్టర్ వందనా గార్గ్ వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా కొండ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
భక్తుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలు విధిస్తున్నామని, మహా దీపం వెలిగించే రోజున ఎవరినీ కొండపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కాబట్టి కార్తీక దీపోత్సవాలకు తిరువణ్ణామలై వెళ్లాలని భావిస్తున్న భక్తులు ఈ నిబంధనలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
