
హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్ ధరలను భారీగా తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీపావళి కానుకగా కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునే ప్రయాణికులకు ఇది ఊరటనిచ్చే అంశం. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో కామన్ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పాస్ ద్వారా రెండు రవాణా సేవలకు విడివిడిగా టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.
అయితే ప్రారంభంలో నిర్ణయించిన పాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి. ధరలను తగ్గించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పాస్ ధరలను సగానికి పైగా తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం. నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొత్త కామన్ పాస్ ధరలు ఇవే!
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ ధరల్లో కీలక మార్పులు చేయనున్నారు.
- ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ కామన్ పాస్ ధరను రూ.325కు తగ్గించనున్నట్లు సమాచారం.
- ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ పాస్ ధరను రూ.4,000 లేదా రూ.4,500కు తగ్గించే అవకాశం ఉంది.
- నవంబర్ 8 నుంచి కొత్త ధరలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
- నెలవారీ రూ.4,000 పాస్‌లో ఆర్టీసీకి రూ.1,000, మెట్రోకు రూ.3,000 కేటాయించే అవకాశముంది.
- రోజువారీ రూ.325 పాస్‌లో ఆర్టీసీకి రూ.75, మెట్రోకు రూ.250 చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం.
ఈ ధరలు అధికారికంగా ప్రకటించిన తర్వాత పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.
ఆర్టీసీ, మెట్రో అధికారుల మధ్య చర్చలు పూర్తి
కామన్ పాస్ ధరల తగ్గింపుపై ఇప్పటికే ఆర్టీసీ, మెట్రో అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ధరలు తగ్గించాల్సిన అవసరంపై ఇరు విభాగాల అధికారులు సానుకూల నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఆర్టీసీ ఎండీ, మెట్రో సలహాదారు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కొత్త ధరలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయవచ్చని సమాచారం.
గతంలో కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయంటూ విమర్శలు రావడంతో మెట్రో సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ధరల తగ్గింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
కొత్త ధరలు అమల్లోకి వస్తే ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా నెలవారీ పాస్ ధర తగ్గడం వల్ల తరచూ ప్రజా రవాణాను ఉపయోగించుకునే వారికి గణనీయమైన ఊరట లభించనుంది.
గమనిక: పాస్ ధరలు, అమలు తేదీకి సంబంధించిన వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత నిర్ధారణ అవుతాయి.
