
అక్కినేని కుటుంబానికి చెందిన నిర్మాత అక్కినేని వెంకట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినీ నిర్మాణ రంగంలో తన అనుభవాలు, అన్నపూర్ణ స్టూడియోస్ భవిష్యత్తు ప్రణాళికలు, నాగార్జునతో కలిసి చేయాలనుకున్న సినిమాల గురించి పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా చేయాలనుకున్నామని, అయితే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని తెలిపారు.
ఒకప్పుడు సినీ నిర్మాణంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న తాను ప్రస్తుతం వయసు రీత్యా ఆ బాధ్యతలకు దూరంగా ఉంటున్నానని వెంకట్ చెప్పారు. ప్రతి తరానికి ఆలోచనా విధానం, సినిమా తీసే పద్ధతులు మారుతుంటాయని, ఒక జనరేషన్ తర్వాత నిర్ణయాల్లో తప్పులు జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సినిమాల్లో టెక్నాలజీ పెరిగినప్పటికీ హింస కూడా ఎక్కువైందని అన్నారు. అయినప్పటికీ మంచి కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, ‘శివ’ వంటి సినిమాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
అమితాబ్, నాగార్జునతో భారీ ఫోక్లోర్ సినిమా ప్లాన్!
గతంలో తన సోదరుడు నాగార్జునతో కలిసి అమితాబ్ బచ్చన్‌ను కలిసిన సందర్భాన్ని వెంకట్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అమితాబ్ ఓ తెలుగు సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపించారని వెల్లడించారు. దీంతో లయన్ కింగ్ తరహాలో తండ్రి, కొడుకుల అనుబంధం ప్రధానంగా సాగే ఓ ఫోక్లోర్ కథను తెరకెక్కించాలని తాను ఆలోచించినట్లు చెప్పారు.
ఈ కథలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించేలా ప్లాన్ చేశామని తెలిపారు. కామెడీ, రొమాన్స్, అడ్వెంచర్, ఉత్కంఠ వంటి అన్ని అంశాలు కలగలిసిన కథగా దీన్ని రూపొందించాలని భావించామని వివరించారు. అయితే ఈ ప్రాజెక్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నదని అమితాబ్ అభిప్రాయపడినట్లు చెప్పారు. అప్పట్లో ఇలాంటి భారీ చిత్రాలను రూపొందించడానికి అవసరమైన టెక్నాలజీ, గ్రాఫిక్స్ అందుబాటులో లేకపోవడంతో సినిమా కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు. ఇప్పుడు ‘బాహుబలి’ వంటి చిత్రాలను తెరకెక్కించేందుకు ఉన్న సాంకేతిక సదుపాయాలు అప్పట్లో ఉండి ఉంటే ఆ సినిమా సాధ్యమయ్యేదని అభిప్రాయపడ్డారు.
అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి భారీ సినిమాలు!
అన్నపూర్ణ స్టూడియోస్ భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా వెంకట్ కీలక విషయాలు వెల్లడించారు. కేవలం సినిమా నిర్మాణానికి అవసరమైన సేవలు అందించడమే కాకుండా, తమ కుటుంబ సినీ వారసత్వాన్ని కొనసాగించాలంటే నాణ్యమైన సినిమాలు నిర్మించాలని తాను, నాగార్జున గత మూడేళ్లుగా ఆలోచిస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా ప్రత్యేక నిర్మాణ విభాగాన్ని ఏర్పాటు చేసి, అందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. ప్రసాద్ అనే వ్యక్తిని కంటెంట్ హెడ్‌గా నియమించి, కొత్త కథలు, ఆలోచనలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. తొలుత కొన్ని సినిమాలతో ప్రారంభించి, భవిష్యత్తులో ఏడాదికి పది సినిమాల వరకు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పాన్ ఇండియా స్థాయితో పాటు అంతర్జాతీయ మార్కెట్లను కూడా దృష్టిలో ఉంచుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నిర్మాణ ప్రక్రియలో నాగార్జున, సుప్రియతో పాటు ఇతర బోర్డు సభ్యులు కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. కథలు, ప్రాజెక్టులను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే బాధ్యత వారిదేనని పేర్కొన్నారు. అక్కినేని కుటుంబంలోని పురుషులతో పాటు మహిళలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని తెలిపారు. భవిష్యత్తులో యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, కొత్త ఆలోచనలు కలిగిన యువకులు, యువతులు ఈ ప్రయాణంలో భాగం కావాలని అభిప్రాయపడ్డారు.
ఫిట్‌నెస్ గురించి ఏమన్నారంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిట్‌నెస్‌కు ప్రతీకగా ఎవరిని భావిస్తారని అడిగిన ప్రశ్నకు నాగార్జున పేరు ప్రస్తావించారు వెంకట్. అయితే ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారని, పరిశ్రమలో పోటీ కూడా ఎక్కువైందని చెప్పారు.
తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ వెన్నెముక సమస్యతో పాటు డయాబెటిస్ కూడా ఉందని వెల్లడించారు. పదేళ్ల క్రితం పెద్ద శస్త్రచికిత్స చేయించుకున్నానని, ప్రస్తుతం ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా నిర్వహించుకుంటున్నానని తెలిపారు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా ఉండేవాడినని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) నుంచే అలవాటైందని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆరోగ్య విషయంలో చాలా క్రమశిక్షణతో ఉండేవారని చెప్పారు.
ఫిలిం ఛాంబర్ పదవులకు ఎందుకు దూరం?
సినీ పరిశ్రమలోని వివిధ సంఘాల పదవుల్లో ఎందుకు చురుగ్గా ఉండటం లేదనే ప్రశ్నకు కూడా వెంకట్ సమాధానమిచ్చారు. తాను పరిశ్రమలో చురుగ్గా ఉన్న సమయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్, ఫిలింనగర్ క్లబ్ వంటి సంస్థల్లో సభ్యుడిగా పనిచేశానని వెల్లడించారు. ప్రస్తుతం తన వయసు, పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ బాధ్యతల నుంచి దూరంగా ఉంటున్నట్లు వివరించారు.
