
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు అత్యంత ఇష్టమైన భారత మాజీ కెప్టెన్లు ఎవరనే విషయాన్ని వెల్లడించారు. టీమిండియా మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తన ఫేవరెట్ కెప్టెన్లని స్పష్టం చేశారు. ఇటీవల రెడ్డిట్ వేదికగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సచిన్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఓ అభిమాని భారత టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన తన అనుభవాల గురించి ప్రశ్నించారు. కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించడం ఎలా అనిపించిందని, ఆ సమయంలో ఎదురైన సవాళ్లు ఏమిటని అడిగారు. అలాగే దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ టెంబా బవుమా నాయకత్వంపై తన అభిప్రాయాన్ని, తాను ఆడిన కెప్టెన్లలో ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసుకోవాలనుకున్నారు.
కెప్టెన్సీ అనుభవంపై సచిన్ ఏమన్నారంటే?
భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం తనకు ఎంతో గౌరవంగా అనిపించిందని సచిన్ తెలిపారు. అయితే జట్టులో తనకు నచ్చిన ఆటగాళ్లను స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉండేది కాదని వెల్లడించారు. 1990వ దశకంతో పోలిస్తే ప్రస్తుతం బీసీసీఐ మరింత వృత్తిపరమైన సంస్థగా అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. అప్పట్లో భారత క్రికెట్ ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని గుర్తుచేశారు.
టెంబా బవుమా నాయకత్వంపై ప్రశంసలు
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా నాయకత్వ లక్షణాలను సచిన్ ప్రశంసించారు. బవుమా స్ఫూర్తి తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ముందుండి జట్టును నడిపిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్కు విజయాలు అందించడంలో ఆయన పాత్ర అభినందనీయమని అన్నారు. దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ టైటిల్ సాధించడం ప్రపంచ క్రికెట్కు మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు.
గంగూలీ, ధోనీనే నా ఫేవరెట్ కెప్టెన్లు
తనకు ఇష్టమైన కెప్టెన్లు ఎవరనే ప్రశ్నకు సచిన్ ఏమాత్రం సందేహించకుండా సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ పేర్లను ప్రస్తావించారు. ఈ ఇద్దరి నాయకత్వంలో ఆడిన అనుభవం తన క్రికెట్ కెరీర్లో ప్రత్యేకమైనదని చెప్పకనే చెప్పారు.
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది. మరోవైపు ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2011లో భారత్ ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ రెండు కీలక విజయాల్లోనూ సచిన్ భాగస్వామిగా ఉన్నారు.
25 టెస్టులకు టీమిండియా కెప్టెన్గా సచిన్
సచిన్ టెండూల్కర్ 1996 నుంచి 2000 మధ్య రెండు విడతల్లో భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించారు. మొత్తంగా 25 టెస్టుల్లో కెప్టెన్గా వ్యవహరించారు. అయితే ఆ సమయంలో జట్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది. 2000లో స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
2007లో మరోసారి టెస్టు కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ సచిన్ ఆ బాధ్యతలను స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో భారత టెస్టు జట్టు నాయకత్వ బాధ్యతలు ఎంఎస్ ధోనీకి అప్పగించారు. ఇలా తన కెరీర్లో ఎదురైన కెప్టెన్సీ అనుభవాలు, తనకు నచ్చిన నాయకుల గురించి సచిన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
