
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 4: చిల్లర డబ్బుల విషయంలో ప్రయాణికురాలు తోసేయడంతో బస్సు కిందపడి తీవ్రంగా గాయపడిన మహిళా కండక్టర్ ప్రవళిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మరణానికి నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు.
మణుగూరు డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రవళికకు పది రోజుల క్రితం ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. చిల్లర విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో ఆమె బస్సు కిందపడిపోయింది. దీంతో ఆమెను హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి ప్రవళిక తుదిశ్వాస విడిచింది.
బస్సులను డిపోల నుంచి కదలనివ్వని కార్మికులు
ప్రవళిక మృతికి నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు బంద్కు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని డిపోల్లో కార్మికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ప్రవళిక మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, ఆయా డిపోల్లో మేనేజర్లు ప్రవళిక చిత్రపటానికి నివాళులర్పించారు.
