Rohit Sharma and Virat Kohli May Miss Delhi ODI? Here's the Truth Behind the Venue Change

India vs Sri Lanka ODI Series: భారత క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా ఢిల్లీ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే వార్త ఒకటి తెరపైకి వచ్చింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సొంతగడ్డపై ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న అభిమానులకు ఎదురుచూపులు తప్పేలా కనిపిస్తున్నాయి. డిసెంబర్‌లో భారత్, శ్రీలంక మధ్య జరగనున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో నిర్వహించాల్సిన మ్యాచ్ వేదిక మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 13న భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఈ స్టేడియంలో భారీ స్థాయిలో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో నిర్ణీత సమయానికి మ్యాచ్ నిర్వహణ సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా స్టేడియం అవుట్‌ఫీల్డ్‌ను ఆధునిక సాంకేతికతతో కూడిన సాండ్ బేస్డ్ సర్ఫేస్‌గా అభివృద్ధి చేస్తున్నారు. వర్షం కురిసినప్పటికీ త్వరగా నీరు ఇంకిపోయేలా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు పూర్తికావడానికి సుమారు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో డిసెంబర్ నాటికి పనులు పూర్తికాకపోతే మ్యాచ్‌ను మరో నగరానికి తరలించే పరిస్థితి రావచ్చు.

ఇప్పటికే స్టేడియంలో జరుగుతున్న పనుల కారణంగా ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను కూడా ప్రత్యామ్నాయ వేదికలకు మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ నిర్వహణపై కూడా అనిశ్చితి నెలకొంది.

మరోవైపు, ఈ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు తరలించనున్నారంటూ గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ కార్యదర్శి ఖండించారు. మ్యాచ్ వేదికపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌కే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, వీరిద్దరినీ ఢిల్లీలో ఆడుతుండగా చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే స్టేడియం పనులు కారణంగా మ్యాచ్ వేదిక మారితే ఢిల్లీ క్రికెట్ అభిమానులకు నిరాశ తప్పకపోవచ్చు. తుది నిర్ణయం బీసీసీఐ అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *