
చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఓ బాలుడు తన పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న నిర్ణయం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని తండ్రి భావిస్తే.. తనకు అలాంటి సంబరాలు వద్దని, కన్నతల్లి సమాధి వద్దే కేక్ కట్ చేసుకుంటానని ఆరేళ్ల బాలుడు చెప్పిన మాటలు స్థానికులను భావోద్వేగానికి గురిచేశాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
చిన్న వయసులోనే తల్లికి దూరమైన ఆర్యన్
సోమశిలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి గోవింద్‌రెడ్డి, వనజారెడ్డి దంపతులకు చాలా ఏళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ బిడ్డకు ఆరేళ్లు నిండకముందే తల్లి దూరమైంది. గతేడాది మార్చిలో అనారోగ్యంతో వనజారెడ్డి కన్నుమూశారు. దీంతో చిన్నారి ఆర్యన్ తల్లి ప్రేమకు దూరమయ్యాడు.
తల్లి లేని లోటు తెలియకుండా తండ్రి గోవింద్‌రెడ్డి కొడుకును ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చదివిస్తున్నారు. తల్లి జ్ఞాపకాలతో పెరుగుతున్న ఆర్యన్‌కు ఆమెపై ఉన్న అనుబంధం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ఫంక్షన్ హాల్ వేడుకలు వద్దంటూ బాలుడి నిర్ణయం
మంగళవారం ఆర్యన్ పుట్టినరోజు కావడంతో తండ్రి గోవింద్‌రెడ్డి ఘనంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లు చేసి, బంధువులు, సన్నిహితులను కూడా ఆహ్వానించారు. అయితే చివరి నిమిషంలో ఆర్యన్ తీసుకున్న నిర్ణయం తండ్రిని భావోద్వేగానికి గురిచేసింది.
ఫంక్షన్ హాల్‌లో బర్త్‌డే వేడుకలు చేసుకోవడం తనకు ఇష్టం లేదని, తన తల్లి సమాధి దగ్గరే కేక్ కట్ చేసుకుంటానని తండ్రితో చెప్పాడు. చిన్నారి మనసులోని బాధను అర్థం చేసుకున్న గోవింద్‌రెడ్డి, వెంటనే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను రద్దు చేశారు.
తల్లి సమాధి వద్దే పుట్టినరోజు వేడుకలు
కొడుకు కోరిక మేరకు గోవింద్‌రెడ్డి అతడిని తీసుకుని తమ వ్యవసాయ పొలం వద్ద ఉన్న వనజారెడ్డి సమాధి దగ్గరకు వెళ్లారు. సమాధిని పూలతో అందంగా అలంకరించి, అక్కడే కేక్ కట్ చేసి ఆర్యన్ పుట్టినరోజును నిరాడంబరంగా జరిపించారు.
తన పుట్టినరోజున తల్లి సమాధి వద్ద కేక్ కట్ చేయాలన్న ఆరేళ్ల బాలుడి కోరిక, తల్లిపై అతడికి ఉన్న అపారమైన ప్రేమను చాటిచెప్పింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు బాలుడి మాటలకు చలించిపోయారు. తల్లి ప్రేమను చిన్న వయసులోనే కోల్పోయిన ఆర్యన్‌కు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు.
