
Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి త్వరలో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు లెర్నర్స్ లైసెన్స్ (LLR) కోసం ప్రాంతీయ రవాణా శాఖ (RTO) కార్యాలయాలకు వెళ్లడం, పరీక్ష కోసం స్లాట్లు బుక్ చేసుకోవడం, గంటల తరబడి వేచి ఉండటం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఈ సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం సారథి పోర్టల్‌లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆన్లైన్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. మరో వారంలో రవాణా శాఖ దీనిని అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే అభ్యర్థులు ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రాసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ కూడా మరింత సులభతరం కానుంది.
ఏఐ నిఘాలో ఆన్లైన్ పరీక్ష..
ఇంటి నుంచే పరీక్ష రాసే విధానంలో పారదర్శకతను పెంచేందుకు వెబ్‌క్యామ్‌తో కూడిన ఏఐ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అభ్యర్థి పరీక్ష కోసం లాగిన్ అయిన వెంటనే సిస్టమ్ వారి ముఖాన్ని స్కాన్ చేస్తుంది. దరఖాస్తు సమయంలో సమర్పించిన ఫొటోతో పరీక్ష రాస్తున్న వ్యక్తి ముఖాన్ని సరిపోల్చుతుంది. ధ్రువీకరణ పూర్తయిన తర్వాతే తదుపరి ప్రక్రియకు అనుమతిస్తుంది.
అంతేకాకుండా పరీక్ష రాస్తున్నది అసలైన అభ్యర్థేనని నిర్ధారించేందుకు లైవ్‌నెస్ డిటెక్షన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అభ్యర్థిని ఐదుసార్లు నవ్వాలని, ఐదుసార్లు కంటిరెప్పలు ఆడించాలని సిస్టమ్ సూచిస్తుంది. ఈ ధ్రువీకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాతే పరీక్ష ప్రారంభమవుతుంది.
ఈ విధానం అమల్లోకి వస్తే లెర్నర్స్ లైసెన్స్ పొందడం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లేందుకు సమయం కేటాయించలేని వారికి ఈ ఆన్లైన్ పరీక్షా విధానం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
