
‘రామాయణ’ చిత్రంలోని పాటలపై వస్తున్న విమర్శలకు ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో స్పందించారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పట్టించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్క్రీమ్ అమ్ముకోవాలని యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాటకు సంబంధించిన సంగీతంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రెహమాన్.. సంగీతాన్ని అర్థం చేసుకోవడానికి సమయం, సహనం అవసరమని పేర్కొన్నారు.
ఒక పాట తుది రూపం దాల్చడానికి ఎంతో ఆలోచన, సమయం వెచ్చించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఏ విషయాన్నైనా తొందరపడి అంచనా వేయడం సరికాదన్నారు. ఊరగాయ కాలం గడిచేకొద్దీ మరింత రుచిగా మారినట్లే.. సంగీతంలోని స్వరాలు కూడా కాలక్రమేణా మరింతగా ఆకట్టుకుంటాయని అభిప్రాయపడ్డారు. సంగీతాన్ని ఆస్వాదించేటప్పుడు మానవ సంస్కృతి, సంప్రదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రేక్షకులు ఒక్క కోణంలోనే కాకుండా విస్తృత దృక్పథంతో చూడాలని సూచించారు.
ఇదే సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో కలిసి పనిచేయడంపై కూడా రెహమాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జిమ్మర్ ఈ ప్రాజెక్టులో భాగం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై ఆసక్తి పెరిగిందన్నారు. ఐదు భాషల్లో హాలీవుడ్, భారతీయ వెర్షన్లకు విడివిడిగా సంగీతం అందించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేయడం దాదాపు పది చిత్రాలకు సంగీతం అందించిన అనుభూతిని కలిగించిందని చెప్పారు.
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో మొదటి భాగాన్ని నవంబరు 5న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
