
D Educt: Oct 29: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర అటవీశాఖలో ఖాళీగా ఉన్న 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీఓ) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన మూడు నెలల్లోగా పరిపాలనాపరమైన ప్రక్రియను పూర్తి చేసి, నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు.
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. అలాగే, పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరో రెండు నెలల సమయం కల్పిస్తామని వెల్లడించారు. ఒకసారి పరీక్ష తేదీలను ఖరారు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని స్పష్టం చేశారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల నియామక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించనున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. నియామక ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించి, అభ్యర్థులకు త్వరగా ఫలితాలు అందించడమే లక్ష్యంగా పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రాతపరీక్ష పూర్తయిన మూడు వారాల్లోగా తుది ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
