
D Spiritual: Oct 17: సింహాచలం ఆలయంలో వైభవంగా ఆయుధ పూజలు.. అప్పన్నను దర్శించుకున్న కేరళ డీజీపీ
విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో కొలువుదీరిన సింహవల్లితాయార్ సన్నిధిలో మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం ఆయుధ (మూల) పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆయుధాలను ప్రత్యేకంగా కొలువుదీర్చి అర్చకులు లక్ష్మీకుమార్, చక్రవర్తి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు సమర్పించారు. స్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్, ఏఈవో పిల్లా శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి.
అప్పన్నను దర్శించుకున్న కేరళ డీజీపీ
కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ సంప్రదాయం ప్రకారం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. అంతరాలయంలో అర్చకులు ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు.
స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు డీజీపీ, ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
