D Spiritual: Oct 9: ఆరూర్ త్రిశక్తి ఆలయానికి 55 కిలోల ఇత్తడి గంట బహూకరణ

వలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూర్ త్రిశక్తి ఆలయానికి 55 కిలోల బరువున్న ఇత్తడి గంటను భక్తులు బహూకరించారు. గ్రామానికి చెందిన మత్స్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ డైరెక్టర్ కసిరబోయిన లింగయ్య యాదవ్, అరుణ దంపతులు గురువారం అమ్మవారి నిత్య నైవేద్య సమర్పణ సమయంలో ఈ గంటను ఆలయ అర్చకులకు అందజేశారు.

అమ్మవారి సేవలో భాగస్వామ్యం కావడం అదృష్టం: ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. అమ్మవారి సేవలో భాగస్వాములవ్వడాన్ని తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. భక్తితో అమ్మవారికి గంటను సమర్పించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

గంట నాదంతో శుభఫలితాలు: అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ప్రాచీన ఆగమ సంప్రదాయాలను, సంస్కృతిని పరిరక్షించడం ద్వారా దేవాలయాలకు పూర్వవైభవం తీసుకురావచ్చని తెలిపారు. నిత్య నైవేద్య సమర్పణ సమయంలో మోగించే గంట నాదాన్ని వినడం వల్ల భక్తులకు సర్వమంగళాలు కలగడంతో పాటు శుభఫలితాలు ప్రాప్తిస్తాయని వివరించారు.

పలువురి హాజరు: ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు చిరంజీవి మణినందన్, కుమారి రిషిక, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.