
D Educt: Sept 30: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీజీ సీట్ల వివరాలను (సీట్ మ్యాట్రిక్స్) జాతీయ వైద్య కమిషన్ (NMC) పరిధిలోని మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (MARB) మంగళవారం విడుదల చేసింది. దేశంలోని వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ సీట్లకు సంబంధించిన వివరాలను ఈ జాబితాలో పొందుపరిచారు.
తెలంగాణ రాష్ట్రంలో 17 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 3,839 పీజీ సీట్లు ఉన్నట్లు సీట్ మ్యాట్రిక్స్లో వెల్లడైంది. ఈ సీట్ల ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది.
ఇదిలా ఉండగా, వైద్య విద్య సంచాలకుల (DME) పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో 181 పీజీ సీట్లను పెంచాలని NMCకి ప్రతిపాదనలు పంపించారు. ప్రైవేట్ వైద్య కళాశాలల నుంచి కూడా సీట్ల పెంపుతో పాటు కొత్త పీజీ కోర్సుల మంజూరుకు దరఖాస్తులు వెళ్లాయి.
త్వరలో విడుదలయ్యే అప్డేటెడ్ సీట్ మ్యాట్రిక్స్లో ఈ ప్రతిపాదనలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీట్ల పెంపు, కొత్త కోర్సులకు అనుమతులు లభిస్తే రాష్ట్రంలో పీజీ వైద్య విద్యలో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
