
D News : సూపర్‌స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’ సాధించిన సంచలన విజయంతో సీక్వెల్ బిజినెస్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నాలుగు రెట్లు పెరిగిన రేటు?
‘జైలర్’ విడుదల సమయంలో రజినీకాంత్ గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తెలుగు థియేట్రికల్ హక్కులు సుమారు రూ.12 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.48 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
ఇప్పుడు అదే క్రేజ్ ‘జైలర్ 2’కు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సుమారు రూ.45 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంటే మొదటి భాగంతో పోలిస్తే పెట్టుబడి దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్టే.
భారీ టార్గెట్ ముందుంది..
రూ.45 కోట్ల పెట్టుబడితో వస్తున్న ఈ సినిమాకు బాక్సాఫీస్‌పై సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా దసరా సీజన్‌లో ‘జైలర్ 2’తో పాటు మరికొన్ని క్రేజీ సినిమాలు బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
‘జైలర్’ తర్వాత రజినీకాంత్ నటించిన ‘వెట్టయాన్’, ‘కూలీ’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోవడంతో.. ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్ 2’ థియేట్రికల్ బిజినెస్ రూ.200–250 కోట్ల మధ్య ఉండొచ్చనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఇవన్నీ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న లెక్కలే. అధికారిక బిజినెస్ వివరాలు వెలువడితేనే అసలు చిత్రం ఏ స్థాయిలో అమ్ముడైందో స్పష్టత వస్తుంది.
