
1930లో డాన్ బ్రాడ్‌మన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్తూ మధ్యలో సిలోన్లో (ప్రస్తుత శ్రీలంక) ఆగి ప్రదర్శన మ్యాచ్ ఆడింది. అప్పటికి శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ హోదా రావడానికి మరో 45 ఏళ్లు పట్టింది. ఇప్పుడు దాదాపు అలాంటి అరుదైన ఘటనే మళ్లీ ఆసియా గడ్డపై చోటుచేసుకోబోతోంది.
ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన భారత టీ20 జట్టు.. అక్కడి సానో నగరంలో ఆతిథ్య జట్టుతో ప్రత్యేక టీ20 మ్యాచ్ ఆడనుంది. సానో స్టేడియంలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న భారత్‌తో తలపడటం జపాన్‌కు ప్రత్యేక అనుభవంగా మారనుంది.
జపాన్ క్రికెట్‌కు అరుదైన అవకాశం
ఐసీసీ గుర్తింపు కారణంగా జపాన్‌కు ఇప్పటికే టీ20 అంతర్జాతీయ హోదా ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అగ్రస్థాయి జట్లతో పోలిస్తే జపాన్ ఇంకా ఎదగాల్సి ఉంది. అయినప్పటికీ ఈ ఏడాది ఆ జట్టుకు గుర్తుండిపోయే విజయాలు దక్కాయి.
టీ20 ప్రపంచకప్ ఈస్ట్ ఏషియా-పసిఫిక్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో జపాన్.. పపువా న్యూ గినియాపై సంచలన విజయం సాధించింది. ఇప్పటికే రెండు టీ20 ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం ఉన్న పపువా న్యూ గినియాను ఓడించడం జపాన్‌కు పెద్ద ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
ఇప్పుడు భారత స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం ఆ జట్టు ఆటగాళ్లకు మరింత విలువైన అనుభవాన్ని అందించనుంది. టీమిండియా ఆటగాళ్ల ప్రిపరేషన్, టెక్నిక్, వ్యూహాలను దగ్గరగా గమనించే అవకాశం జపాన్ క్రికెటర్లకు లభించనుంది.
బుమ్రా vs ఫ్లెమింగ్పై ఆసక్తి
ఈ మ్యాచ్‌లో జపాన్ కెప్టెన్ కెండల్ కడోవాకి-ఫ్లెమింగ్, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రత్యేక దృష్టి ఉంది. ఆస్ట్రేలియన్ తండ్రి, జపనీస్ తల్లికి జన్మించిన 30 ఏళ్ల ఫ్లెమింగ్.. జపాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు.
2024లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో లచ్లాన్ యమమోటో-లేక్‌తో కలిసి తొలి వికెట్‌కు 258 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో ఏ వికెట్‌కైనా ఇదొక అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది.
మరోవైపు ప్రపంచ క్రికెట్లో తన ప్రత్యేక బౌలింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుమ్రాను ఎదుర్కోవడం జపాన్ బ్యాటర్లకు పెద్ద సవాలే. ముఖ్యంగా ఫ్లెమింగ్‌కు భారత స్టార్ పేసర్‌ను ఎదుర్కొనే అవకాశం ప్రత్యేక అనుభవంగా మారనుంది.
భారత్ తుది జట్టుపై ఉత్కంఠ
గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ ఎక్కువ మంది ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగేది. దీంతో బ్యాటింగ్ లోతు పెరిగినా.. కొన్ని సందర్భాల్లో బౌలింగ్ కాంబినేషన్‌పై ప్రభావం పడేది.
ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌లో నలుగురు స్పెషలిస్ట్ బౌలర్ల కాంబినేషన్‌ను ఉపయోగించిన వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఉండటంతో.. జపాన్‌తో మ్యాచ్‌లో ఎలాంటి టీమ్ కాంబినేషన్ ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
భారత్ తరఫున అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగే అవకాశం ఉంది.
అభిషేక్ శర్మకు కూడా ఈ మ్యాచ్‌లో మరోసారి తన దూకుడైన బ్యాటింగ్‌ను చూపించే అవకాశం ఉంది. జూలై 2024లో టీ20 అరంగేట్రం చేసిన తర్వాత కనీసం 20 టీ20లు ఆడిన బ్యాటర్లలో అతడి స్ట్రైక్ రేట్ 194.55గా ఉండటం అతడి దూకుడుకు నిదర్శనం.
జపాన్ జట్టులో మార్పులు ఉంటాయా?
హాంకాంగ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కెప్టెన్ ఫ్లెమింగ్ ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత్‌తో మ్యాచ్‌లోనూ అతడు అదే స్థానంలో కొనసాగుతాడా? లేక తిరిగి ఓపెనింగ్‌కు వస్తాడా? అనేది చూడాలి.
జపాన్ సంభావ్య జట్టులో లచ్లాన్ యమమోటో-లేక్, రెయో సాకురానో థామస్, కెండల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), బెంజమిన్ ఇటో-డేవిస్, చార్లీ హారా-హింజే, ఇబ్రహీం తకాహాషి, అలెస్టర్ కడోవాకి-ఫ్లెమింగ్, వటారు మియావుచి (వికెట్ కీపర్), డిక్లాన్ సుజుకి, మకోటో తానియామా, షోమా సుగాయా-స్లేటర్ ఉండే అవకాశం ఉంది.
జపాన్ ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో 41 విజయాలు, 19 ఓటములు నమోదు చేసింది.
మ్యాచ్‌కు వరుణుడి ముప్పు
భారత్–జపాన్ మ్యాచ్‌కు ముందు వర్షం ఆందోళన కలిగిస్తోంది. సానో నగరంలో మ్యాచ్‌కు ఒక రోజు ముందు భారీ వర్షం కురవడంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. అంతకుముందు హాంకాంగ్‌తో జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.
దీంతో సానో స్టేడియం డ్రైనేజీ వ్యవస్థకు ఈ మ్యాచ్ పరీక్షగా మారనుంది. చారిత్రాత్మకంగా నిలిచిపోయే అవకాశం ఉన్న భారత్–జపాన్ పోరుకు వర్షం అంతరాయం కలిగించకుండా మ్యాచ్ పూర్తిగా జరగాలని ఇరు జట్ల అభిమానులు ఆశిస్తున్నారు.
