
D NEWS: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరమైంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పేరు ప్రస్తుతం ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున కొత్త అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. దానం అనర్హత వ్యవహారంపై న్యాయపరమైన పరిణామాల తర్వాత ఈ అంశంపై పార్టీ మరోసారి దృష్టి సారించింది.
బీఆర్ఎస్‌లో సాయికిరణ్ యాదవ్‌తో పాటు మన్నె గోవర్ధన్‌రెడ్డి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉప ఎన్నిక వస్తే పోటీకి సిద్ధంగా ఉండాలని మన్నె గోవర్ధన్‌రెడ్డికి పార్టీ నేతలు గతంలో సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా నియోజకవర్గంలో తన రాజకీయ ఏర్పాట్లు చేసుకున్నారు.
తన కుమారుడు సాయికిరణ్ యాదవ్‌కు అవకాశం ఇస్తే ఉప ఎన్నిక బాధ్యతలను తానే చూసుకుంటానని తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నాయకత్వానికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఖైరతాబాద్‌లో తనకు ఉన్న రాజకీయ పరిచయాలు, పార్టీ క్యాడర్‌తో సంబంధాలు, సామాజిక సమీకరణాలపై తనకు అవగాహన ఉందని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
అయితే సాయికిరణ్ యాదవ్ అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అవసరమైతే సర్వే నిర్వహించి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. సాయికిరణ్‌కు టికెట్ దక్కని పరిస్థితిలో విష్ణువర్ధన్‌రెడ్డి లేదా మన్నె గోవర్ధన్‌రెడ్డి పేర్లను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్‌లో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఆసక్తికరంగా మారింది.
