
D News: సౌత్ ఇండస్ట్రీలో అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య-జ్యోతిక తమ 20 ఏళ్ల వైవాహిక బంధాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చర్చిలో మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాతో మొదలైన ప్రేమ
సూర్య, జ్యోతిక 1999లో వచ్చిన ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006 సెప్టెంబర్ 11న వివాహం చేసుకున్నారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చర్చిలో మరోసారి ప్రమాణాలు
20 ఏళ్ల వివాహ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలో జ్యోతిక తెల్లటి బ్రైడల్ గౌనులో, సూర్య ప్రత్యేక సూట్‌లో కనిపించారు. జ్యోతిక చర్చిలోకి వస్తున్న సమయంలో సూర్య ఎమోషనల్ అయిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. సూర్య సోదరుడు కార్తి కూడా ఆయన పక్కనే ఉండి అభినందించారు. అనంతరం ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని మరోసారి వివాహ ప్రమాణాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పూలవర్షంతో ఈ జంటను ఆశీర్వదించారు.
జ్యోతిక ఎమోషనల్ పోస్ట్
ఈ సందర్భంగా జ్యోతిక సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేసింది. 20 ఏళ్ల ప్రయాణంలో చేసిన త్యాగాలు, సర్దుబాట్లు, నిస్వార్థ ప్రేమకు గుర్తుగా తమ ప్రమాణాలను మరోసారి పునరుద్ధరించుకున్నామని తెలిపింది. దియా, దేవ్‌కు మంచి తల్లిగా ఉంటానని, సూర్యతో తన స్నేహాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని చెప్పింది. సూర్యతో కలిసి మరో 20 ఏళ్ల ప్రయాణానికి సిద్ధంగా ఉన్నానంటూ తన ప్రేమను వ్యక్తం చేసింది.
