
D News: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా **‘రణబాలి’**పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమా విడుదల వాయిదా పడనుందని, డిసెంబర్ 3కి షిఫ్ట్ చేస్తున్నారంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో కూడా ఆందోళన మొదలైంది. అయితే ఈ వార్తలకు చిత్రబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది.
‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా అక్టోబర్ 16, 2026న దసరా కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం వంటి కారణాలతో ‘రణబాలి’ రిలీజ్ వాయిదా పడుతుందంటూ ప్రచారం మొదలైంది. దీనికి తోడు దసరా సమయంలో ‘జైలర్ 2’ విడుదల ఉండటంతో రిలీజ్ డేట్ మార్చే అవకాశం ఉందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ‘రణబాలి’ టీమ్ స్పందించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ 16 రిలీజ్లో ఎలాంటి మార్పు లేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాయిదా వార్తలు కేవలం రూమర్లేనని తేల్చిచెప్పింది.
దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్కు తెరపడింది. విజయ్ దేవరకొండ అభిమానులు ఊపిరి పీల్చుకోగా.. దసరా బరిలో ‘రణబాలి’ కోసం అంచనాలు మరింత పెరిగాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
