
D News: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న NBK 111పై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి ‘దాదా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టైటిల్ వీడియోలో బాలయ్యను అత్యంత పవర్ఫుల్ అవతారంలో చూపించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో వచ్చే సన్నివేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ పోలీసులు తుపాకులు గురిపెట్టి ఉన్నా.. ఏమాత్రం బెదరకుండా బాలకృష్ణ దర్జాగా కూర్చొని వారికి ఎదురు తిరిగే సీన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.“నాకు గురిపెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు… బుల్లెట్స్‌కి బలుపు ఉండాలి, గన్స్‌కి గట్స్ ఉండాలి” అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సన్నివేశంతో సినిమాలో ఆయన పాత్ర ఎంత దూకుడుగా ఉండబోతుందనే ఆసక్తి పెరిగింది.
టైటిల్ వీడియోను బట్టి చూస్తే.. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథలో బాలయ్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చేతిలో గొడ్డలి, ఆయుధాలతో ఆయన కనిపించిన షాట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అయితే పూర్తి కథ, పాత్ర స్వరూపంపై చిత్రబృందం మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలయ్య ఎలివేషన్‌కు మరింత బలం చేకూర్చింది.
ఇప్పటికే టైటిల్‌తోనే భారీ హైప్ తెచ్చుకున్న ‘దాదా’.. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. బాలయ్యను ఇంతకుముందు చూడని తరహా గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించబోతున్నారనే ప్రచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక థియేటర్లలో ‘దాదా’ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.
