
D News: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో సినిమా పనులకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సినిమాకు సంబంధించిన కొన్ని కీలక పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ పాట చిత్రీకరణతో పాటు సాంకేతిక పనులు కూడా మిగిలి ఉన్నాయని సమాచారం. దీంతో నిర్ణయించిన తేదీకి అన్ని పనులు పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’ను సెప్టెంబర్ 24నే విడుదల చేయాలా? లేక మరికొంత సమయం తీసుకోవాలా? అనే అంశంపై చిత్ర బృందంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా వాయిదా పడినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.అందువల్ల ప్రస్తుతం సెప్టెంబర్ 24 విడుదల తేదీనే అధికారికంగా పరిగణించాల్సి ఉంటుంది. వాయిదా వార్తలు మాత్రం ప్రస్తుతానికి రిపోర్టులకే పరిమితం. మేకర్స్ నుంచి వచ్చే తదుపరి ప్రకటనతో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
