D News: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక అవకాశం లభించింది. లక్సెంబర్గ్‌ వెంచర్‌ డేస్‌-2026లో కీలక ప్రసంగం చేయాలని ఆయనకు ఆహ్వానం అందింది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో లక్సెంబర్గ్‌లో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది.

పెట్టుబడుల విధానాలపై ప్రసంగం

ఆసియా, యూరప్‌ పెట్టుబడి విధానాల్లో తేడాలు, పెట్టుబడిదారుల రిస్క్‌ అంచనా, స్టార్టప్‌ వ్యవస్థాపకుల అంచనాలు, పెట్టుబడి అవకాశాలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై కేటీఆర్‌ ప్రత్యేక సెషన్‌లో మాట్లాడనున్నారు.

అంతర్జాతీయ గుర్తింపు

స్టార్టప్‌లు, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, పెట్టుబడుల రంగాల్లో కేటీఆర్‌కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు ఈ ఆహ్వానం పంపారు. భారత్‌ను ప్రపంచ పెట్టుబడులు, ఇన్నోవేషన్‌ వ్యవస్థలతో అనుసంధానించడంలో ఆయన అనుభవం యూరప్‌ పెట్టుబడిదారులు, స్టార్టప్‌ వ్యవస్థాపకులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

భారీ స్థాయిలో ప్రతినిధుల హాజరు

లక్సెంబర్గ్‌ వెంచర్‌ డేస్‌-2026కు పెట్టుబడిదారులు, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, విధాన నిర్ణేతలు హాజరుకానున్నారు. గత ఏడాది 28 దేశాల నుంచి సుమారు 3,400 మంది ప్రతినిధులు, 300 మందికి పైగా పెట్టుబడిదారులు, 110కు పైగా వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

స్టార్టప్‌లు, డిఫెన్స్‌ రంగంపై ప్రత్యేక దృష్టి

ఈ ఏడాది కార్యక్రమంలో యూరోపియన్‌ బిజినెస్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌ వార్షిక సమావేశంతో పాటు NATO ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆధ్వర్యంలో డిఫెన్స్‌ వెంచర్‌ డే నిర్వహించనున్నారు. యూరప్‌లోని స్టార్టప్‌లు, స్కేల్‌అప్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.