
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మరోసారి తన క్రికెట్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పోలీస్ యూనిఫామ్‌లో డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించే ఆయన బ్యాట్ పట్టగానే క్రికెటర్‌గా అదరగొడుతున్నారు. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా, క్రికెట్‌పై తనకున్న ఆసక్తిని మాత్రం కొనసాగిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సీ-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో సీవీ ఆనంద్ అద్భుతమైన సెంచరీ సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓపెనర్‌గా 82 బంతుల్లోనే 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.
సీవీ ఆనంద్ మెరుపు ఇన్నింగ్స్‌తో సికింద్రాబాద్ క్లబ్ భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించిన ఆయన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ లీగ్‌లో ఆయన నమోదు చేసిన తొలి శతకం ఇదే కావడం విశేషం.
సీవీ ఆనంద్‌కు క్రికెట్‌తో అనుబంధం ఇప్పటిది కాదు. ఐపీఎస్‌లోకి రాకముందు నుంచే ఆయన క్రికెట్‌పై ఆసక్తితో ఆడేవారు. చిన్ననాటి నుంచే క్రికెట్‌ను ఇష్టపడిన ఆయన అండర్-22 స్థాయిలోనూ ప్రాతినిధ్యం వహించారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున గతంలోనూ పలు సెంచరీలు సాధించారు. 2025లోనూ ఆయన వరుసగా శతకాలు బాదిన సందర్భాలు ఉన్నాయి.
క్రికెట్‌తో పాటు టెన్నిస్, గోల్ఫ్ వంటి క్రీడలపైనా ఆసక్తి కనబరిచే సీవీ ఆనంద్ క్రీడల ద్వారా తన ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా క్రికెట్ మైదానంలో బ్యాట్‌తో అదరగొట్టిన డీజీపీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
