• దరఖాస్తు దశ నుంచే సమస్త సమాచారం నిక్షిప్తం
  • పోలీసు నియామకాల్లో వినూత్న ప్రయోగం

పోటీ పరీక్షల నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా తెలంగాణ పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మరో ప్రయోగం చేయనుంది. హోం తదితర శాఖల్లో పోస్టుల భర్తీకి చేపడుతున్న నియామకాల ప్రక్రియలో కచ్చితత్వం కోసం అభ్యర్థుల సమస్త వివరాలను ప్రత్యేకంగా నిక్షిప్తం చేస్తోంది. ఇందుకోసం ప్రతి అభ్యర్థికి యూనిక్ ఐడీ (విశిష్ట గుర్తింపు సంఖ్య)ని కేటాయిస్తోంది.

దరఖాస్తు దశ నుంచి అభ్యర్థి ఉద్యోగం సాధించడం లేదా పోటీ నుంచి నిష్క్రమించే వరకు గల పూర్తి వివరాలను అందులో పొందుపరుస్తోంది. ఈ క్రమంలో ఫామ్-ఎ, ఫామ్-బీలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించింది. నియామకాలకు సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఫిర్యాదు చేసినా.. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేసినా ఈ వివరాలే కీలకం కావడంతో ఈ అంశానికి మండలి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.

ప్రతి దశ కీలకమే…

మిగిలిన పోటీ పరీక్షలతో పోలిస్తే యూనిఫాం సర్వీసులకు శారీరక సామర్థ్య పరీక్షలు అదనం. వీటి నిర్వహణ సవాళ్లతో కూడుకొని ఉంటుంది. దీనికితోడు కటాఫ్ మార్కులను హారిజాంటల్, వర్టికల్ విధానాల్లో పకడ్బందీగా కేటాయించాలి. వీటిపై అభ్యర్థులు అనేక సందేహాలు లేవనెత్తే అవకాశముంటుంది. అందుకే ప్రతి దశలో అభ్యర్థి కనబరిచే ప్రతిభ, సామర్థ్యానికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని యూనిక్ ఐడీలో నిక్షిప్తం చేస్తున్నారు.

  • ఎంపిక ప్రక్రియ ముగిసేవరకు.. అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటారు.
  • తొలుత ప్రాథమిక రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులు పార్ట్-1 దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే తదుపరి దశ కోసం పార్ట్-2 దరఖాస్తును పూరించాలి. వీటిలోని వివరాలు ఎప్పటికప్పుడు ఐడీలో నిక్షిప్తమవుతాయి.
  • పార్ట్-2 దరఖాస్తు నమోదు చేసిన అనంతరం నిర్వహించే శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ)ల వివరాలతోపాటు తుది రాతపరీక్షలో కనబరిచిన ప్రతిభ, అభ్యర్థి పూర్వచరిత్రకు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) విచారణ సమాచారాన్నీ పొందుపరుస్తారు. ఇలా అన్ని దశల్లో సమగ్ర వివరాలను ఒకేచోట పొందుపరచడం ద్వారా వివాదాలను నివారించాలని అధికారులు భావిస్తున్నారు.

By Hemanth