D News: Aug 12: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇల్లు కొనుగోలు కోసం చేసిన రూ.90 లక్షల అప్పు భారం కావడం, బ్యాంకు రుణం మంజూరు కాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న శేశాల నరేష్‌ (35), ఆయన భార్య మేఘన (30) వినాయక్‌నగర్‌లోని తమ అద్దె ఇంట్లో మృతి చెందారు.

నరేష్‌ విద్యుత్‌ శాఖలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. గతేడాది ఇల్లు కొనుగోలు చేసేందుకు రూ.90 లక్షలు అప్పు చేసినట్లు సమాచారం. బ్యాంకు రుణం మంజూరవుతుందని భావించినప్పటికీ లోన్‌ రాకపోవడంతో అప్పుల భారం పెరిగింది. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఆ ఇంటిని విక్రయించి కొంత మొత్తాన్ని చెల్లించినప్పటికీ, మిగిలిన భారీ అప్పు కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు సంబంధించి నరేష్‌ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నట్లు సమాచారం.

మంగళవారం ఉదయం మేఘన తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ పిల్లలను వేరొకరి ఇంటికి పంపించినట్లు చెప్పడంతో బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే ఇంటికి వెళ్లారు. ఎంత పిలిచినా తలుపులు తెరవకపోవడంతో కిటికీలోంచి పరిశీలించగా నరేష్‌ మృతి చెంది ఉండగా, మేఘన కూడా అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు నరేష్‌, మేఘన రాసినట్లు భావిస్తున్న సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.