
డి న్యూస్ 12: ఆగస్టు వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఇళ్ల బాల్కనీలు, మేడలు, కార్యాలయాలు, దుకాణాల వద్ద త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. అయితే త్రివర్ణం సాధారణ అలంకరణ వస్తువు కాదు.. దానికి ప్రత్యేకమైన గౌరవం, చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. Flag Code of India, 2002, Prevention of Insults to National Honour Act, 1971 ప్రకారం జెండా ప్రదర్శనకు కొన్ని నియమాలు ఉన్నాయి. 2021, 2022లో చేసిన మార్పులతో ఇళ్లపై పగలు, రాత్రి కూడా జెండాను ప్రదర్శించే అవకాశం కల్పించారు. ‘హర్ ఘర్ త్రివర్ణ’లో భాగంగా జెండాను ఎగురవేసే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే.
1. కాషాయం పైభాగంలో ఉండాలి: త్రివర్ణంలో కాషాయం పైన, తెలుపు మధ్యలో, ఆకుపచ్చ కింద ఉండాలి. నిలువుగా ప్రదర్శించినప్పుడు కాషాయం చూసే వ్యక్తికి కుడివైపు ఉండేలా చూడాలి.
2. 3:2 నిష్పత్తి పాటించాలి: జాతీయ జెండా పొడవు, వెడల్పు నిష్పత్తి 3:2గా ఉండాలి. పరిమాణం స్థలాన్ని బట్టి మార్చుకోవచ్చు.
3. గౌరవప్రదమైన స్థానంలో ఉంచాలి: జెండా స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. దాని కంటే పైగా మరో జెండా లేదా అలంకరణ ఉండకూడదు.
4. ఒకే స్తంభంపై మరో జెండా వద్దు: త్రివర్ణంతో పాటు అదే స్తంభంపై మరో జెండాను ఎగురవేయకూడదు.
5. చిరిగిన జెండాను ఉపయోగించకండి: దెబ్బతిన్న, రంగు వెలిసిన లేదా పాడైన జెండాను ప్రదర్శించకూడదు.
6. నేలను, నీటిని తాకకూడదు: జాతీయ జెండా నేలపై లేదా నీటిలో పడకుండా జాగ్రత్తపడాలి. వేడుకల తర్వాత కూడా గౌరవప్రదంగా నిర్వహించాలి.
7. జెండాపై రాతలు వద్దు: పేర్లు, నినాదాలు, ప్రకటనలు లేదా ఇతర సందేశాలను జాతీయ జెండాపై రాయడం, ముద్రించడం చేయకూడదు.
8. అలంకరణకు ఉపయోగించకండి: త్రివర్ణాన్ని తెరలు, టేబుల్ కవర్లు, కుషన్లు వంటి వస్తువులకు ఉపయోగించకూడదు. అనుచిత దుస్తులపై కూడా ముద్రించకూడదు.
9. అనుమతించిన పదార్థాలతోనే తయారీ: 2021 మార్పుల ప్రకారం ఖాదీతో పాటు పత్తి, పాలిస్టర్, ఉన్ని, పట్టు వంటి అనుమతించిన పదార్థాలతో జెండాను తయారు చేయవచ్చు. ప్లాస్టిక్ జెండాలను వాడితే వాటిని వేడుకల తర్వాత గౌరవప్రదంగా నిర్వహించాలి.
10. రాత్రిపూట కూడా ప్రదర్శించవచ్చు: 2022 సవరణ తర్వాత ఇళ్లపై పగలు, రాత్రి రెండింటిలోనూ జాతీయ జెండాను ప్రదర్శించవచ్చు. రాత్రివేళ కూడా అది స్పష్టంగా కనిపించేలా, గౌరవప్రదంగా ఉండేలా చూడాలి.
