
D Educt: Aug 12: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల నిరసనలు రెండో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన స్టైఫండ్ పెంపుపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కేవలం 3 శాతం మాత్రమే స్టైఫండ్ పెంచుతామని ప్రభుత్వం ప్రతిపాదించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.
ప్రభుత్వ నిబంధనలు, జీవో ప్రకారం తమ స్టైఫండ్‌ను 30 శాతం వరకు పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో కనీసం 15 శాతమైనా పెంచాలని వారు కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మంగళవారం హెల్త్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బుధవారం విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేశారు. ఈ సమస్య కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,000 మంది జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
పొరుగున ఉన్న తెలంగాణలో అందిస్తున్న విధంగానే తమకు కూడా గౌరవప్రదమైన స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమానమైన సేవలు అందిస్తున్నప్పుడు ఏపీలో తక్కువ స్టైఫండ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.
అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరసన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే జోక్యం చేసుకుని స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన, సానుకూల ప్రకటన చేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో నిరసనలు, సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
