
దేశ యువత రీల్స్ యుగంలో షార్ట్‌కట్స్‌ను ఎంచుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. విజయాన్ని త్వరగా అందుకోవడం కంటే, కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని, ఆత్మకథలు చదవాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రచించిన “Triumph of the Indian Republic: My Life, My Struggles” పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. కోవింద్ తన బాల్యం నుంచి 14వ రాష్ట్రపతిగా ఎదిగిన ప్రయాణంతో పాటు, రాష్ట్రపతి భవన్‌లోని ఐదేళ్ల అనుభవాలను ఈ పుస్తకంలో వివరించారు.
షార్ట్‌కట్ మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది: అంటూ ప్రధాని నరేంద్ర మోదీ యువతకు సూచించారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ రోజుల్లో తక్షణ ఫలితాల కోసం తొందరపడకుండా, ఓర్పుతో ముందుకు సాగాలని అన్నారు.
రైల్వే స్టేషన్లలో కనిపించే హెచ్చరికలను ఉదాహరణగా తీసుకున్న మోదీ, జీవితంలోనూ షార్ట్‌కట్‌లను ఎంచుకోవద్దని సూచించారు. ఎప్పుడైనా షార్ట్‌కట్ కోసం ఆలోచన వస్తే, మంచి ఆత్మకథ చదవాలని యువతకు పిలుపునిచ్చారు.
రామ్‌నాథ్ కోవింద్ రచనలు, అనుభవాలు నేటి తరానికి ఎంతో ఉపయోగపడతాయని, వాటి నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథ భారత ప్రజాస్వామ్యం, సమాజానికి విలువైన వారసత్వంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆత్మకథ కేవలం వ్యక్తి కథ కాదుః ప్రధాని: రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిజాయితీ, విలువలు, స్వచ్ఛత విషయంలో రాజీ పడకుండా ఎలా ఎదిగారనే అంశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. తన జీవితంలోని కష్టాలు వ్యక్తిగతమైనవైనా, వాటి ఫలితంగా వచ్చిన విజయం మాత్రం భారత గణతంత్రం, ప్రజాస్వామ్య విజయం అని పుస్తక శీర్షికను విశ్లేషిస్తూ మోదీ పేర్కొన్నారు. ఈ పుస్తకం కోవింద్ జీవితంలోని జ్ఞాపకాలను మాత్రమే కాకుండా, భారత ప్రజాస్వామ్య ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను కూడా భవిష్యత్ తరాలకు భద్రపరుస్తుందని ఆయన అన్నారు.
