
D-News: కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని తొలి షెడ్యూల్లో రాష్ట్రం పేరును ‘కేరళ’ నుంచి ‘కేరళం’గా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మేరకు 2024 జూన్లో కేరళ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కోరుతూ కేరళ శాసనసభ 2024లో తీర్మానం చేసిందని తెలిపారు. మలయాళంలో రాష్ట్రం పేరు ‘కేరళం’గా ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో మాత్రం ‘కేరళ’గా పేర్కొనడంతో ఈ మార్పు కోసం కేంద్రాన్ని కోరినట్లు వివరించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. దీనికి అనుగుణంగా రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేసేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రం పేరును కేరళ నుంచి కేరళంగా మార్చడంపై కాంగ్రెస్కు ఏమైనా అభ్యంతరం ఉంటే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) చట్టానికి సవరణలు చేయడానికి ఉద్దేశించిన నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, 2026కు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
ఈ సవరణల ద్వారా పారిశ్రామిక వస్తువుల రంగంలో కూడా NCDC తన కార్యకలాపాలను చేపట్టేందుకు అవకాశం కల్పించారు. అలాగే, సహకార రంగ అభివృద్ధిలో పనిచేస్తున్న సంస్థలకు NCDC ద్వారా నిధులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, సహకార సంఘాలు లేదా సహకార అభివృద్ధికి సంబంధించిన సంస్థలకు NCDC నేరుగా రుణాలు, గ్రాంట్లు అందించవచ్చు.
బిల్లుపై మాట్లాడిన మురళీధర్ మొహోల్.. దేశంలోని సహకార రంగం సమగ్ర, నిరంతర అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించేందుకు 1963లో NCDC ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రారంభంలో సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, సంబంధిత సేవలకే సంస్థ కార్యకలాపాలు ప్రధానంగా పరిమితమయ్యాయని చెప్పారు.
అయితే, కాలక్రమేణా NCDC కార్యకలాపాలు విస్తరించాయని, ప్రాసెసింగ్, మార్కెటింగ్, నిల్వ, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పథకాల రూపకల్పన, అమలులో సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అదేవిధంగా, మౌలిక వసతులు, సాంకేతికత, ఆర్థిక సేవలు వంటి రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి NCDC పనిచేస్తోందన్నారు.
మరోవైపు, సహకార రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో NCDC విధుల పరిధిని మరింత విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. 1963 నుంచి 2014 వరకు గత ప్రభుత్వం సుమారు రూ.45 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించగా, 2014 తర్వాత గత 11 ఏళ్లలో ఈ మొత్తం దాదాపు రూ.4 లక్షల కోట్లకు పెరిగిందని మురళీధర్ మొహోల్ తెలిపారు.
