
DNews 28 Feb: సైబర్ నేరాలు, డిజిటల్ ఫ్రాడ్స్ అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘సిమ్-బైండింగ్’ నిబంధనను కఠినతరం చేస్తోంది. రేపటి (మార్చి 1) నుండి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
సాధారణంగా మనం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఖాతాను ఒక ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత, ఆ సిమ్ కార్డు ఫోన్లో లేకపోయినా యాప్ పనిచేస్తుంది. కానీ, కొత్త నిబంధన ప్రకారం:
మీరు ఏ నంబర్‌తో అయితే అకౌంట్ క్రియేట్ చేశారో, ఆ సిమ్ కార్డు తప్పనిసరిగా అదే ఫోన్లో యాక్టివ్‌గా ఉండాలి.
ఒకవేళ మీరు ఫోన్ నుండి సిమ్ తీసివేస్తే లేదా ఆ సిమ్ ఇన్‌యాక్టివ్ అయితే, మీ మెసేజింగ్ యాప్ పనిచేయడం ఆగిపోతుంది.
ఈ మార్పు వల్ల సాధారణ వినియోగదారులతో పాటు వ్యాపారవేత్తలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు:
లింక్డ్ డివైజ్ (Linked Devices): ప్రస్తుతం ఒకే వాట్సాప్ ఖాతాను ఫోన్, లాప్టాప్ లేదా టాబ్లెట్లలో వాడుతున్నాము. మార్చి 1 నుండి, వాట్సాప్ వెబ్ (Web) ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది. తిరిగి లాగిన్ అవ్వాలంటే ప్రైమరీ ఫోన్ (సిమ్ ఉన్న ఫోన్) ద్వారా మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.
మల్టీ-డివైజ్ సపోర్ట్: సిమ్ స్లాట్ లేని ఐప్యాడ్లు లేదా టాబ్లెట్లలో వాట్సాప్ వాడటం ఇకపై కష్టతరం కానుంది.
సైబర్ భద్రత: నకిలీ నంబర్లతో లేదా ఇతరుల నంబర్లతో అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడేవారికి ఈ రూల్ అడ్డుకట్ట వేస్తుంది.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయంపై స్పందిస్తూ, “జాతీయ భద్రత మరియు సైబర్ నేరాల నియంత్రణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ నిబంధనల అమలులో గడువు పొడిగింపు ఉండదు” అని స్పష్టం చేశారు.
టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి ఇతర ఓటీటీ (OTT) కమ్యూనికేషన్ యాప్‌లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. వినియోగదారులు తమ యాప్‌లను అప్డేట్ చేసుకోవాలని మరియు రిజిస్టర్డ్ సిమ్ కార్డును ఫోన్లోనే ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
