
DNews: Feb 02: సిద్ధిపేట జిల్లా గజ్వెల్ ప్రగ్యాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో ఎస్ఐటీ దర్యాప్తు త్వరగా పూర్తవ్వాలని, నేరస్థులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ 2014 జూన్‌లో అసెంబ్లీలో మాట్లాడుతూ, తప్పు చేసిన వారు కుమారులు, కుమార్తెలు అయినా జైలుకు పంపిస్తానని చెప్పిన మాటలు ఇప్పుడు కేసీఆర్‌కే వర్తిస్తాయని రఘునందన్ స్పష్టం చేశారు.
గజ్వెల్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ గజ్వెల్‌ను ‘గడా’గా, సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్‌ను ‘కుడా’గా పిలిచినా, ఆ నియోజకవర్గాల ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. కేసీఆర్ పాలనలో గజ్వెల్ అభివృద్ధి చెందలేదని, గత రెండు సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దానిపై శ్రద్ధ చూపలేదని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్న వారిని రఘునందన్ ‘అంధులు’ అని విమర్శించారు. తెలంగాణకు ఏమీ లేవని చెప్పే వారిలో ప్రతి ఒక్కరూ వేరువేరుగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ ఒక విధంగా, హరీష్ రావు, కవిత మరో విధంగా వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. ఈసారి దక్షిణ భారతానికి 7 హై-స్పీడ్ రైళ్లు కేటాయించగా, వాటిలో 3 హై-స్పీడ్ రైళ్లు హైదరాబాద్‌కు కేటాయించబడ్డాయని ఆయన వివరించారు. రైల్వే రంగానికి గత బడ్జెట్‌తో పోలిస్తే 15 శాతం ఎక్కువ నిధులు కేటాయించారని, తెలంగాణ అభివృద్ధి కోసం ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ రూ.1300 కోట్లు అదనంగా కేటాయించారని రఘునందన్ స్పష్టం చేశారు
