
D NEWS: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో నోటీసులు అందుకున్న 38.25 లక్షల మంది ఓటర్లు ఇప్పటివరకు స్పందించలేదని అధికారులు గుర్తించారు. వారికి మరోసారి అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం 2.64 కోట్ల మంది ఓటర్లు SIR ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. వీరిలో 92,88,174 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, 1.71 కోట్ల మందికి నోటీసులు అవసరం లేకపోయింది. ఇప్పటివరకు 85.25 లక్షల మందికి నోటీసులు జారీ కాగా, మరో ఏడు లక్షలకు పైగా నోటీసులు ఇవ్వాల్సి ఉంది.
నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు 50.55 లక్షల మంది విచారణ ప్రక్రియ పూర్తయింది. వీరిలో 36.50 లక్షల మంది సమర్పించిన వివరాలు, డాక్యుమెంట్లు సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్పందించని 38.25 లక్షల మందికి మరో తేదీ కేటాయించి డాక్యుమెంట్లు సమర్పించే అవకాశం ఇవ్వనున్నారు.
అయితే ఇతర ప్రాంతాల్లో నివసించడం, దూర ప్రాంతాల నుంచి రావడానికి ఇబ్బందులు, కూలీ పనులు, ప్రైవేటు ఉద్యోగాలకు సెలవు దొరకకపోవడం వంటి కారణాలతో చాలామంది నోటీసులకు స్పందించలేకపోతున్నారని అధికారులు గుర్తించారు. ప్రయాణ ఖర్చులు, ఇతర వ్యయ ప్రయాసలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని తెలిపారు. ఆన్లైన్లో డాక్యుమెంట్లు సమర్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ స్వయంగా రావాల్సి ఉంటుందని భావించడంతో కొంతమంది వెనుకడుగు వేస్తున్నట్లు గుర్తించారు.
ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటరు స్వయంగా రావాల్సిన అవసరం లేదని వెసులుబాటు కల్పించింది. కుటుంబంలో ఒకరు హాజరైతే సరిపోతుందని స్పష్టం చేసింది. అయినప్పటికీ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నోటీసులను రీషెడ్యూల్ చేస్తున్నారు. మరోవైపు, ప్రతి ఓటును పరిశీలించిన తర్వాతే తుది ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
